ఎవరికి నా
ఓటిచ్చేది ?
గీటురాయి 17-11-1989
“వలపు
రూపెరుగదు. కామాంధునికీ సూకరం కూడా సుందరాంగిలా కనిపిస్తుంది.
ఆకలితో నాలుక అరుచి ఎరుగదు. అంబలికూడా అమృతంలా
ఉంటుంది. పిచ్చికోపం ఎదుటివాడి ఎక్కువ తక్కువలు ఎరుగదు. ప్రాణబంధువునైనా పగవాణ్ణి చేస్తుంది. నిదుర సుఖమెరుగదు. ముంచుకొచ్చినప్పుడు
కసవుపోగు కూడా పూలపాన్పులాగా అనిపిస్తుంది. కామం
కాల నిర్ణయాలెరుగదు. ఇష్టమొచ్చిన టైమ్ లోనే అనుకున్న పని అయిపోవాలంటుంది.” అని ఓపెద్ద మనిషి నాకీ మధ్య
లెక్చరిచ్చాడు. ఇంతకీ ఈ సొద అంతరార్ధమేమిటి అని అడిగితే, రాజీవ్ గాంధీ ఇంత ఆత్రంగా హడావుడిగా
ఎలక్షన్లు పెట్టడం ఆయన దురాశ ఫలితమేనని చెప్పాడు. అయితే చిక్కుల గుర్రానికి
కక్కుల కళ్ళెంలాగా ప్రతిపక్షాల కూటమి కుదిరింది
గదా ఇంకా ఎందుకు నీకీ ఆవేదన అని అతన్ని సముదాయించాను.
చిగురించే కోరిక చేతిలో దాగనట్లుగా ఆ
హస్తప్రయోగాలు పేపర్లలో రోజుకో విధంగా కనిపిస్తున్నాయి. భారతదేశం కోసం నా హృదయం తెగ స్పందిస్తున్నది అంటూ ‘రీడిఫ్యూజన్’ పేరుతో హస్త వాసన దేశ వ్యాప్తంగా సోకింది. ఎన్నికల వాగ్ధానాల కంటే ముందే
ప్రతిపక్షాలను పడదిట్టడం ఆరంభయ్యింది.
ప్రతిపక్షాల వాళ్ళను తేళ్ళు,
జెర్రులు, మండ్రగబ్బలు, కోతికొమ్మచ్చి
ఆడేవాళ్లు, కొయ్యగుర్రాన్ని విరగకొట్టే వాళ్ళుగా
బొమ్మలతో సహా వర్ణించారు.
ఇంతకీ
ఇక్కడ సంగతేమిటంటే మన అమ్మో,
నాయనో చనిపోతే వారి సంస్మరణదినం చేసుకోవటానికి,మనబాబు పుట్టిన రోజుగురించి ప్రకటించడానికి, తప్పిపోయిన పిల్లవాడి ఆచూకీ తెలుపమని అడ్వర్టైజ్ మెంట్ ఇవ్వటానికీ మనలో చాలా మందికి శక్తి చాలదు. ఒక చిన్న బాక్స్ లాంటి ప్రకటన వేయడానికి కూడా పత్రికలలో రేట్లు చాలా ఎక్కువ ఉంటాయి.
అలాంటిది ‘రిడీ ఫ్యూజన్’ ఖర్చు ఎంత ఉంటుందో ఆలోచించండి. పొదుపు పొదుపు అని గొంతు చించుకునే నాయకులు
ఇలాంటి వ్యర్ధప్రచారానికి చేసే ఖర్చు
కూడా పేదవాళ్ళకు పంచితే సార్ధకం అవుతుంది. ఎక్కడెక్కడి
నల్ల దబ్బంతా ఎలక్షన్లలో సారాయికి, గోడల మీద రాతలకీ, ఊళ్ళ మీద పడి ర్యాలీలు నడపటానికీ, గూండాలను మేపటానికీ బయటికొస్తున్నది. పేదవాడు పెంట తింటే ఆకలికని, మారాజు తింటే మందుకని అన్నట్లుగా ఈ దేశంలో సామాన్య ప్రజలకొక న్యాయం, రాజకీయనాయకులకు
సంపన్న వర్గాలకూ మరొక న్యాయం అమలు జరుగుతోంది.
కేవలం కాంగ్రెస్ దే ఈ పాపమంతా అని నేననటం లేదు. డబ్బులున్న ప్రతి పార్టీ ఇలాగే చేస్తుంది. ప్రచారాలకు
చేసే ఖర్చు సముద్రంలో పారబోసిన చెక్కెర లాగా నిష్ప్రయోజనం. మురికి వాడల్లోని జనానికి ఆ డబ్బుతో
కొన్ని సౌకర్యాలు కల్పించవచ్చు.
పల్లెటూళ్లలో అభివృద్ధి కార్యక్రమాల కోసం పార్టీ తరుఫున
డబ్బు దానం చేయవచ్చు. కానీ ఈనాడు మతకలహాల మధ్య, మారణకాండల మధ్య ఎలక్షన్లు జరుగుతున్నాయి. దురాక్రమణ తత్వం, పదవీలోలత్వం
మధ్య మానవత్వం మంటగలిసింది.
“మా
నాన్న ఎక్కడ – నా భర్త ఏడి ?
నా కొడుకెక్కడ – నా కూతురేది ? అని కలహాగ్నిలో కాలి మిగిలిన వాళ్ళు
సోకిస్తున్నారు. ఙ్ఞాపకాల రంపపుకోతని
భరించలేక దిగులుతో కుంగిపోతున్న భర్తలు,
మరణించిన భర్తల్ని తలచుకొని
విలపిస్తున్న భార్యలు, ఆకలి మంటలు తాళలేక ఏడుస్తున్న
పిల్లలు, నిప్పుల మీద నడిచిన బాల్యం, గుప్పున మండి చల్లారిన వైవాహిక
జీవితం, పొగలు కమ్ముకున్న భవితవ్యం, అగ్నిశిఖలా జ్వాజ్వలిస్తున్న వర్తమానం. “
అని ఓ కవి చేసిన వర్ణన నేటి పరిస్థితుల్ని కళ్ళకు కడుతున్నది. ఇలాంటి భయంకర పరిస్థితుల్లో రకరకాల మేనిఫెస్టోలతో మాయచేస్తూ పదవీ దాహంతో పరుగులు
తీస్తూ, ప్రజల్ని చీల్చి పోటీలకు దింపుతున్న నాయకుల్నీ, ఈ దేశ దౌర్భాగ్యస్థితిని ఎలా వర్ణించేది ? ఎవరికి నా ఓటిచ్చేది ?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి