కారము
- ప్రతీకారము
గీటురాయి 13-1-1989
కన్నేల
పోయెనోయి కనకలింగమా అంటే చేసుకున్న కర్మమోయి శంభులింగమా అన్నాడట ఎవడో. మరి ఈ జన్మలో చేశామో
మరే జన్మల్లో చేశామో గాని మొత్తం మీద
అనేక తప్పుడు పనులు చేయబట్టే ఈ కర్మభూమిలో
పుట్టి ఉంటాం. గత జన్మల కర్మలన్నీ ఈ జన్మలో మనల్ని ఇక్కడ ఇలా కట్టి కుదుపుతున్నాయని చెప్పుకోవచ్చు. లేకపోతే ఏమిటండీ, వీధిలో
అడుగుబెట్టినకాడనుండీ అడుక్కునేవాళ్ళు, జేబు దొంగలు,
గూండాలు ఎదురవుతుంటే, ఆఫీసుల్లో లంచగొండులు, అడవుల్లో నక్సలైట్లు అధికార పీఠాల్లో, ప్రతిపక్ష శిబిరాల్లో కులగజ్జి
వంటినిండా పట్టిన హత్యా రాజకీయ
నాయకులు వర్ధిల్లుతున్నారు. హత్యలకు, దోపిడీలకు మునిగాళ్ల మీద
సిద్దంగా ఉన్న అలగా జనానికి కొరతలేదు. పెరటికి
పోయినవాడిని తన్నలేక
ఏ పాపం ఎరుగని వాణ్ణి తన్నే రకం పోలీసులకూ తరుగులేదు. వీళ్ళల్లో ఏ ఒక్కరి బారిన పడకుండా జీవితమంతా మర్యాదకరంగా, మృదువుగా, సుఖంగా గడిపి చనిపోగలవారు, చనిపోయినవారు బహు అరుదు. మరి ఇదంతా
పూర్వ జన్మ సుకృతమూ, రుణానుబంధమూ కాకపోతే మారేమిటి ? అని ఓ పంతులుగారు నాకీ మధ్య పాఠం చెప్పారు.
చచ్చిపోయి ఎక్కడున్నాడోగాని
వంకాయలపాటి వెంకట కవి గారు కూడా ఓ
పద్యంలో ఇలా వాపోయారు : -
“వచ్చిన
అపకీర్తి చచ్చిన పోవదు
తీర్చి
పుచ్చక అప్పు తీరదేపుడు
చేసిన
కర్మంబు చెల్లదు కుడుపక
చావు దప్పదు ఎంత జడిసియున్న
దేహంతమున
గాని తెలియవు తన పాట్లు
జన నింద
కంటెను చావు మంచి...”
కత్తిమీద
సాము కడతేర బోదయా అన్నారు పెద్దలు. కత్తి తీసుకున్నవాడు
కత్తితోటే సంహరించబడతాడని ఏసుక్రీస్తు చెప్పారు. కడుపు వస్తే
కనే తీరాలి అన్నట్లుగా చేసిన దుష్కృత్యాల ఫలితం అనుభవించక తప్పదు ఎవరికైనా. పలుకుబడి, మంద బలం గలిగిన ఓ మొద్దు మనిషి, కండబలం లేని ఓ పెద్ద
మనిషిని చంపుతాడు లేదా చంపిస్తాడు లేదా ఇలా హత్యాకాండల
ద్వారానే తన మనుగడ నిలుపుకుంటూ ఉంటాడు. వాడి క్రౌర్యానికి
దడిచి, తమ పెళ్ళాం బిడ్డల మేలుకోరి పోలీసులు
సైతం వాడికి వంగి సలాము చేస్తారు. పత్రికల
వాళ్ళు కూడా తమ మీద ఎక్కడ పగ తీర్చుకుంటాడో
అనే భయంతో అతన్ని గురించి ప్రశంసలే గాని అసలు వాస్తవం
ప్రచురించరు. సత్యాన్ని మాత్రమే చూడగలిగే వాళ్ళకు మాత్రం ఇదంతా మొద్దు మొగానికి గరుడసేవ అన్నట్లుంటుంది. ఇంకా బెదిరించి బెండకాయ పులుసు పోస్తున్నారనిపిస్తుంది.
భంగు తాగేవాడికి హంగుగాళ్ళు పది మంది
అన్నట్లుగా బాంబులు వేసేవాడికి కూడా గండ్రగొడ్డళ్ళ
వాడకంలో ఆరితేరిన అనుచరులు, తలలు తీసే బంటులు చాలామంది ఉంటారు.
ఇలాంటి ముఠా నాయకులు ఊరికి ఇద్దరు ఉంటే చాలు ఊరి మీద విమానం ద్వారా ఉప్పు
చల్లిస్తే చిటపట లాడుతుంది, ఊళ్ళో జనం మీద పట్టు సంపాదించడానికి ఈ
జంట నాయకులు వారి బంటులూ ప్రాణాలతో బంతులాడుతుంటారు. వాళ్ళ తలలు వీళ్లూ, వీళ్ళ తలలు వాళ్ళూ అప్పుడప్పుడూ కోసి
ఎగురవేస్తుంటారు. Might
is right
అన్నారు. అంటే బలం గలవాడిదే రాజ్యమని, బలం గలవాడు చేసిందంతా రైటేనని అర్ధం. ఆ రకంగా ఇరు వర్గాలూ
కలసి ప్రతీకార చక్రాన్ని సదా తిప్పుతుంటారు .
ఈ క్రియ ప్రతిక్రియ, కారము ప్రతీకారము అనే చక్రం నిరంతరం
తిరుగుతూనే ఉంటుంది. ఇందులోని సాయుధ పాణులకు క్రోధమే ప్రధానం గాని లోక క్షేమం
గాదు. ఇరు వర్గాలలో ఏదో ఒక ప్రాణి బలి అయినప్పుడు గోడ మీద
కాచుకూర్చున్న రాజకీయ రాబందులు ఆ శవం మీద వాలుతారు. దాని మీద కులం గుడ్డ
కప్పుతారు. పార్టీ పతాకం ఎగురవేస్తారు. ప్రత్యర్ధుల మీదకు తన మందను ఎగదోస్తారు. అందినంత
సొమ్ము చేసుకుంటారు. రౌడీలు రాజకీయ నాయకులైతే ఒకరు ఏటికి తీస్తే మరొకరు కాటికి
తీస్తారు. వాళ్ళ మధ్యలో నలిగి చచ్చేది మనమే – కాబట్టి దూరంగా తొలగిపోతూ ఉండటం మంచిదని నా సలహా.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి