6, నవంబర్ 2012, మంగళవారం

దిక్కు లేని ముసలి వాళ్ళు



      దిక్కు లేని ముసలి వాళ్ళు
గీటురాయి 20-1-1989

                 పడక మీద తుమ్మ ముళ్ళు పరచె నొక్కడు
              అయ్యో ఇంటి దీప మార్పి వేయనెంచె నొక్కడు
              తల్లీ తండ్రులు విషమని తలచె నొక్కడు
              పడుచు పెళ్లామే బెల్లమనీ భ్రమసె నొక్కడు

              అయ్యా ఇలాంటి కొడుకులు ఆ తల్లిదండ్రులకు డుగురు ఉన్నారట. ఏం ప్రయోజనం ? ఏడుగురూ తోడు దొంగలై తల్లీ తండ్రిని వాళ్ళ    ముసలితనంలో చూడకుండా హింస పెట్టారు. ఆస్తిని చీల్చి కెళ్ళి, దూర దేశంలో దుర్వ్యసనాలతో డబ్బంతా  పోగొట్టుకుని, పందులు తినే పొట్టుతో        పొట్ట పోసుకునే వాడు, ఙ్ఞానోదయమై తిరిగి వచ్చిన కుమారుడొకడు బైబిల్ లో కనిపిస్తాడు.       

              పది నెలలు నను మోసి పాలిచ్చీ పెంచి
              మదిరోయక నాకేన్నో ఊడిగాలు చేసినా
              ఓ తల్లీ నిను నలుగురిలో నగుబాటు చేసితి
              తలచకమ్మ తనయుని ప్పలు మన్నించవమ్మా

              అమ్మా, నాన్నా అంటూ ఆర్తనాదాలు చేస్తూ కుంటి వాడై వచ్చిన ఓ   కొడుకు పాండురంగ మహత్యంలో దర్శనమిస్తాడు. పైగా మాతా పిత     పాదసేవే మాధవసేవ అని మరువనంటాడు.

              ఇలాంటి పరివర్తనులందరికీ వారి వారి దుస్థితిలోనే ఙ్ఞానో       దయమయ్యింది. అయితే దుర్మార్గులయిన కొడుకులు కూతుళ్లందరికీ     దుస్థితి ప్రాప్తించటం లేదు. ఙ్ఞానోదయం కావటం లేదు ఎవరో కొందరు   మాత్రమే పశ్చాత్తాపానికీ, ప్రాయశ్చిత్తానికీ ప్రతీకలుగా ఆదర్శనీయులుగా       ఉదాహరణల కోసం నిలబడి ఉన్నారు. మిగతా దుష్టులంతా నిక్షేపంగా        బ్రతుకుతున్నారు.

           ఈ లోకాన్ని ఒక్కసారి ఆబ్సర్వ్ చేస్తే అమ్మ కడుపులో ఉన్న వాడు,        సమాధిలో ఉన్నవాడు మాత్రమే మంచివాడు అనే సామెత నిజమనిపిస్తున్నది. అమ్మకు పుట్టిన ఆరుగురూ గుగ్గిళ్ళ దొంగలేనన్నట్లుగా ప్రతి కుటుంబంగనుక ఉంటే ఇక  ముసలి వాళ్ళ శేష జీవితాలకు ముసురు పట్టినట్లే. తల్లికి కూడు పెట్టని వాడు తగవు తీర్చటానికి వచ్చినట్లుగా చాలా మంది పుత్ర రత్నాలు ఈ సమాజంలో పెద్ద మనుషుల్లాగా చెలామణి అవుతున్నారు. పెంతినే బర్రె కొమ్ములు కోస్తే మానుతుందా అన్నట్లు ఎంత మంది ఏమనుకుంటున్నా సరే తమ స్వార్ధమే పరమార్ధంగా భావిస్తూ జన్మ నిచ్చిన తల్లి దండ్రుల్ని ఇంట్లోంచి వెళ్లగొడుతున్న వారు, ఇంట్లో   ఉంచుకునే తిండికి మాడ్చే వారు, ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తూ కూడా       వారి పోషణకోసం మాత్రం సాయం చెయ్యని వారు, గుడిపూడి జంగాలలాగా మాటలతో కాలం గడిపేవారు ఎంతో మంది ఉన్నారు. భర్త  వదిలేసిన భార్యకు భరణం ఇవ్వాలని కోర్టులు తీర్పులిస్తున్నాయి. అయితే కన్న బిడ్డలు వదిలేసిన వృద్ధుల పోషణ ఖర్చును కూడా కోర్టులు ఇప్పించటం అత్యవసరం అనిపిస్తున్నది. మరి దిక్కులేని ముసలి వాళ్ళను ఎవరు పోషించాలి ? అడుక్కు తినే ముసలి వాళ్ళను అడిగి చూడండి, అసలు సంగతి చెబుతారు.
             
ఏ పాద సేవ కాశీ ప్రయాగాది పవిత్ర భూములకన్న విమలతరమో               
 ఏ పాదపూజ రమాపతి చరణాబ్జ పూజలకన్న పుణ్యతరమో
 ఏ పాద తీర్ధము పాప సంతాపాగ్ని ఆర్పజాలిన అమృత ఝరమో...  
 అట్టి పితరుల సేవ ఆత్మ మరచిన వారిని కావగలవారు లేరు ఈ జగాన

              అంటూ ఎవరు ఎన్ని రీతులుగా నీతులు చెబుతున్నా, దిక్కులేని     వృద్ధుల సంఖ్య మన దేశంలో పెరిగి పోతూనే ఉంది. యాచకులు, భైరాగుల మధ్య నిర్వహించిన ఓ సర్వేలో ఎక్కువ మంది తమ పిల్లలు నెట్టి వేసినందున ఇలా బిక్షగాళ్ల మయ్యామని చెప్పారట. వృద్ధుల ఆశ్రమాలలో ఉన్న వాళ్ళు కూడా తమ పిల్లలు తరిమి వేసినట్లు చెప్పారట, అంతర్జాతీయ బాలల సంవత్సరం లాగానే అంతర్జాతీయ వృద్ధుల సంవత్సరం ఒకటి జరిగి వృద్ధులకు సహాయ పడే చట్టాలు నిర్మించడం అవసరం. బాలలూ వృద్ధులూ సమానులే కదా !

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి