ఆదర్శవంతమైన నిరసన
గీటురాయి 25-8-1989
కలిమిగలనాడే మనుజుడు
విలసిత సత్ కీర్తి చేత మెలయగ వలెరాయా
కలిమేల ఎల్లకాలము
కులగిరులా కదలకుండా గువ్వలచెన్నా
అన్నట్లుగా పదవిలో ఉండగానే పది మంచి
పనులు చేసి పది మంది చేత శెహ బాష్ అనిపించుకోవాలి.
పదవి ఎల్లకాలం ఉండేది కాదు గదా ?
ఎన్నికలోస్తున్నాయనగానే ఏవో నాలుగైదు
పధకాలు ప్రారంభించి జనంలో పలుకుబడి
సాధించదలచే నాయకులు మన దేశంలో చాలా మంది ఉన్నారు.
కానీ పులి లేళ్ళను చంపకుండా మళ్లిపోతుందా ? పిల్లి కోడిపిల్లను పట్టకుండా మానుకుంటుందా ? తోడేలు మేకల్ని, పెనుబాము కప్పల్ని, కొంగ
చేపల్ని, డేగ గువ్వల్నీ మింగేయకుండా ఉంటాయా ? ఎంత మాత్రం ఉండవు. అలాగే పదవిని అధిష్టించి ప్రజాధనం మేయటానికి అలవాటైన నాయకుడు ఆ పదవిని ఒక పట్టాన వదలడు ఆ పదవిని
పదిలంగా రక్షించుకోటానికి పడరాని పాట్లు పడతాడు. ఈసారి ఎన్నికల్లో నన్ను
గనుక గెలిపిస్తే ఫలానాది తవ్వి మీ తలల కెత్తుతానంటాడు.
ఊరికో
సముద్రాన్ని సైతం కల్పిస్తానని వాగ్దానం చేస్తాడు. తన పదవి నిలుపుకోవటం కోసం మరో పది మందితో పొత్తు కూడా
కుదుర్చుకుంటాడు. అయితే పొత్తుల పనిలో
ఎలాగో చచ్చినట్లుగా తయారై తరువాత అది అచ్చిరాలేదంటాడు.
పదవిలో ఉండగా పనులేమీ చేయలేదని ప్రజలు విమర్శిస్తే
నాపైన ఉన్నవాడు పైసలు రాల్చకపోతే నేనేం చేసేది ఆని అంటాడు. ఆ పైవాడేమో నేను అంత ఇచ్చాను, ఇంత ఇచ్చాను. అదంతా ఏం
చేశాడో, ఎటు మళ్ళించాడో కనుక్కోండి అని అంటాడు. వీడు “
నోరుముయ్యి గాడిదా, ద్రోహి”
అని వాడిని తిడితే, వాడు “షటప్ కుక్కా, నత్తగుల్లా”
అని వీడిని తిడతాడు. ఈ రకంగా ఒకళ్ల నొకళ్లు తిట్టుకొని మనకు ప్రొద్దుపోని వినోదం కలిగిస్తారు. ఆ తరువాత
ఒకరికి వ్యతిరేకంగా మరొకరు నిరాహార
దీక్షలు, ఊరేగింపులు , ప్రదర్శనలు, బందులూ జరుపుతారు.
ఒకరు బస్సుల్ని
ఆపితే మరొకరు రైళ్లనాపుతారు. ఈ రణరంగంలో
చివరికి చిక్కి నలిగి పోయేది ప్రజలే. ఉరిసిన పుండు మీద ఉప్పూకారం
జల్లినట్లుగా ప్రజల
పరిస్థితి తయారౌతుంది. అయితే పై నాయకులతో పోటీకి
దిగి, ప్రజలకు తన వల్ల అయినంత మేలు
చేసే ఛోటా నాయకులు కూడా
ఉంటారు. ప్రస్తుతం
‘హైదరాబాదు నగర మేయరు శ్రీ జుల్ఫికర్ ఆలీ అలాంటి
వారిలో ఒకరు. ఆయన ముఖ్యమంత్రి మీద తన నిరసనను ఒక కొత్త
పద్ధతిలో
వ్యక్తం చేశారు. బందులు చేయించలేదు. ఇబ్బందులు పెట్టలేదు.
కేవలం తన బృందాన్ని వెంట వేసుకుని, చీపుర్లు తీసుకుని, వీధులు ఊడ్చే ఓ నెల కార్యక్రమం చేపట్టాడు. వాళ్ళు ఊడ్చి వెళ్ళిన
వీధుల్లోకి వెళ్ళి చూచాను. ఊడ్చే
సిబ్బంది ఊడ్చినంత నాణ్యంగా ఊడ్వలేదు గాని ఊడ్వక ముందు ఉన్న పరిస్థితి కంటే మెరుగ్గానే కనపడింది.
అప్పుడు
నాకు అనిపించింది – దేశంలోని ప్రతి మేయరు, ప్రతి మునిసిపాలిటీ
చైర్మను, ప్రతి పంచాయితీ సర్పంచ్, ప్రతి రాజకీయ పార్టీ నాయకుడు, ప్రజాధనాన్ని మేసే ప్రతి ఒక్కడూ, ప్రజా సేవకుడినని బొంకే ప్రతివాడూ
ఇలా చీపురూ, పారా మొదలైన పనిముట్లు తీసుకుని , తమ తమ పరివారాలను
వెంట వేసుకుని వారానికో వీధి చొప్పున ఎంచుకొని ఊడిస్తే, మురుగు కాల్వలను శుభ్రం చేస్తే దేశంలో చాలా విశుద్ధ పాలన నెలకుంటుంది
గదా అని. గాంధీ గారు కూడా హరిజన వాడలు ఊడ్చే మహాత్ముడనిపించుకున్నాడు. ప్రజలకు సేవ చేస్తామని
పడిచస్తున్న నాయకులు ఇలాంటి పనులు
చేసి గొప్పవారు కావాలని మనవి. ఇలాంటి పనులు
చేయటం వల్ల వారిలో తప్పులేవైనా ఉంటే ప్రక్షాళనం కూడా అవుతాయి. ప్రజల సింపతీ దొరుకుతుంది. పదవి నిలుస్తుంది. నాయకులారా, నడుం బిగించండి !
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి