13, నవంబర్ 2012, మంగళవారం

దొందూ దొందే



   దొందూ దొందే
గీటురాయి  8-9-1989
                  ఆలస్యం అమృతం విషం అన్నారు. అమృతం అంటే చావనిది లేక     చావు లేనిది అని అర్ధం. అంటే అది చావదు. దానిని ఆస్వాదించిన వాడిని    చావనియ్యదు. అలాంటి జీవ వర్ధక వస్తువును కూడా ఆలస్యంగా అందిస్తే       విషంలాగా మారి ప్రాణాలు తోడేస్తుందని పండితుల భావన. దిన, వార,       మాస పత్రికలు సరిగ్గా సమయానికి రాక, తద్దినాలకో, పెద్ద పండుగలకో        ఒకసారి ఏజెంటు, పోస్ట్ మాన్ తెచ్చి ఇస్తుంటే, పాఠకుల కోపం ఎలా   ఉంటుందంటే, ఆ పత్రిక నడిపే వారు గనుక దొరికితే కసీదీరా  పిడి గుద్దులు     గుద్దాలనిపిస్తుంది. ఎందుకంటే పత్రిక రుచి మరిగాక పాఠకులు నిర్ణీత       సమయానికి ఆవురావురుమంటూ ఎదురు చూస్తుంటారు. అనుకున్న టైమ్       కు పత్రికను అందించకపోతే పాఠకులను ఆకలితో మాడ్చినట్లే అవుతుంది.

              కానీ వార్ధక్యంలో చిన్న వయసు పెండ్లాము దొరికిన వాడిలాగా, నిష్ట రిద్రంలో ఎక్కువ మంది సంతానం కలిగిన వానిలాగా, ఇంటి పొరుగునే అత్తవారి ఇల్లు తోడైన వాడిలాగా, సంగీత విద్వాంసుడి ప్రక్కనే జలుబు దగ్గులు తుమ్ములతో ఊదరగొట్టే వాడు చేరినట్లుగా, ఈడ్చి కొట్టే   వానాకాలంలో ప్రయాణం చేసేవాడిలాగా, నరాలు వణికే చలికాలంలో వేకువజామున దీక్ష చేసే వాడిలాగా పత్రిక తయారైతే, ఆ బాధ పాఠకులకు    చెప్పుకోలేక, చెప్పి సముదాయించుకోలేక, లోలోన దాచుకోలేక పత్రికా     యాజమాన్యం పడే సిగ్గూ, బాధా అంతా ఇంతా కావు. ఇదంతా తానే తుమ్మి       తానే శతాయుష్షు అనుకున్నట్లుగా ఉంటుంది. నిక్కీ నీలిగీ ఒక్కొక్క సంచిక        వెలువరించేటప్పటికి అందులో సంధించిన సంగతులన్నీ కాలం చెల్లిపోయి పాఠకులకు పసందునివ్వక పెదవి విరిపిస్తాయి. ఎన్నడూ దొరకనమ్మకు    ఏగాని దొరికితే ఏడు ముళ్ళు వేసిందట. మరో పత్రిక మొఖమే       చూడదలచుకోని పాఠకుడికయితే అతని ఏకైక అభిమాన పత్రిక ఎంత లేటుగా వచ్చినా అందులోని విషయాలే యమా తాజాగా ఉంటాయి. ఇవన్నీ        ఇదివరకటి విషయాలేగా అని ఎవరైనా తేలికగా కొట్టిపారేసినా, అతను అంత       తొందర పనికిరాదంటాడు. పరుగెత్తి పాయసం తాగటం కంటే నిలబడి నీళ్ళు   త్రాగమే మేలంటాడు.

              నిదానమే ప్రధానం. ఆలస్యమే అమృతం అని మనసా వాచా కర్మణా నమ్మే పాఠకులతో జాగులమారి ఆలస్యపు పత్రికలకు ఎలాంటి సమస్యా      ఉండదు. తాపీగా వారానిది నెలకు జమచేసి పంపవచ్చు.


              ఇంతకీ నేను న్యాయవ్యవస్థలోని జాగుల గురించి మీకు చెబుదామనుకొని పత్రికల జాగు గురించి చెప్పాను. పరవాలేదు. ఇక ఇటు   ద్దాం. మొన్న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి గారు       ఎర్రకోట మీద నుంచి ఓ కేక వేశాడు – న్యాయవ్యవస్థను ప్రక్షాళనం    చెయ్యబోతున్నామోచ్ అని.  అంత పెద్ద పొలికేక ఎందుకు వెయ్యవలసి        వచ్చిందంటే సుప్రీం కోర్టులో 2 లక్షల పైగా, హైకోర్టుల్లో 16 లక్షలపైగా, దిగువ       కోర్టుల్లో కోటిపైగా కేసులు పెండింగ్ లో ఉన్నాయ. అంటే జాగులమారి        కోర్టులైపోయాయన్నమాట. నల్లటి గబ్బిలం రంగు గౌనులు ధరించి      మోరన్ డ్రాక్యూలా లాగా దర్శనమిసున్న ఈ న్యాయవాద        జాగులమారులను ప్రక్షాళనం చెయ్యటం అందరికీ సంతోషమే. అయితే        ప్రక్షాళనం పేరుతో చేపట్టే పనులు అయ్యవారిని చెయ్యబోతే కోతి       అయినట్లుగా ఉండకూడదు. న్యాయం ఆలశ్యంగా అందితే అసలు న్యాయం   జరగనట్లేనని సామెత. అందుకే కేంద్రానికి కనికరం ఉంటే కోర్టు ఫీజులు రద్దు        చెయ్యాలి. జాగు చెయ్యకుండా జడ్జీల పోస్టులు భర్తీ చెయ్యాలి. వేసవి     శలవులు, వానాకాలం శలవులు అంటూ కోర్టులను మూసివేయకుండా        రైళ్లూ బస్సులు మాదిరిగా ఆదివారాలతో సహా  మున్నూట అరవై రోజులు   పనిచేయించాలి. నల్లగౌనులు తగలబెట్టి తెల్లబట్టలు వేసుకోమనాలి. కోర్టు తీర్పులు అన్యాయంగా, గడ్డికరిచినట్లుగా ఉంటే వాటిని విమర్శించే హక్కు      ప్రజలకు పత్రికలకూ ఉండాలి. దక్షిణాదిన సుప్రీంకోర్టు బెంచి ఏర్పాటు    చెయ్యాలి. లోక్ అదాలత్ లు విరివిగా ఏర్పాటు చెయ్యాలి. అన్ని  స్థాయిలలో        అదికారాన్ని వికేంద్రీకరించాలి. కోర్టు తీర్పుల్లో ఆలస్యం అంతం కావాలంటే    ఇంకా ఎన్నో చెయ్యాలి. పత్రికలు ఆలస్యంగా వచ్చినా పరవాలేదు కానీ       న్యాయస్థానాల తీర్పులు ఆలస్యంగా రావటం ఎంతో హాని అని నా     అభిప్రాయం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి