కపట వైఖరి వద్దు
గీటురాయి 17-2-1989
గడ్డి తినైనా సరే గండ్ర గొడ్డలి
కొని తీరుతానని శపథం చేసిన దుష్టుణ్ణి, నీతి బోధతో
ఎవరాపగలరు ? ఖానేకు నహీ ఎల్లీకి బులావ్ అన్నట్లుగా పాకిస్తాన్
ఆయుధాల సేకరణ పేరుతో తలకు మించిన బరువును ఎత్తుకుంది.
దానిని చూసి వాత పెట్టుకున్న రీతిలోనే మన దేశం కూడా ఏడాదికి 15 వేల కోట్ల రూపాయలు రక్షణ రంగానికే
వ్యయం చేస్తున్నది. ఈ ఖర్చు మీద
ఎలాంటి ఆడిట్ ఉండకపోవటం, రక్షణ ఖర్చులన్నీ రహస్యంగా ఉండటం, బోఫోర్స్ తరహాలో భారీగా ముడుపులు
ముట్టడం లాంటి ఆశాజనకమయిన విషయాలు
రాజకీయ నాయకులకు ఉన్నందువల్ల పొరుగు
దేశాన్ని బూచిగా చూపించి, ప్రజల్ని భయపెట్టి, పొరుగు దేశాన్ని తిట్టడం ద్వారా దేశభక్తిని ప్రదర్శించి, ఓట్లు రాబట్టి, తమ పదవులను నిలుపుకొని,
ఆదాయం పొందటానికి అతి అనువుగా ఉంది ఈ రక్షణ రంగం అని
మేధావులు గోల చేస్తున్నారు. ఇప్పుడు రక్షణ కోసం చేసే 15 వేల కోట్లను 4 వేల
కోట్లకు కుదిస్తే మిగిలే 11 వేల కోట్లతో ఈ దేశంలోని ప్రతి నిరుద్యోగికి సంవత్సరానికి వెయ్యి రూపాయల భృతి ఇవ్వటంతో పాటు, దేశంలోని బడి పిల్లలందరికీ మధ్యాహ్న భోజనం కూడా పెట్టొచ్చుననీ రిపబ్లిక్ డే సంధర్భంగా “బ్లిట్జ్”
పత్రిక బట్టబయలు చేసింది.
అంటే ఆయుధాల తపన ఆగిపోతే మిగిలే డబ్బుతో
ఆకలి చావుల్ని ఆపవచ్చు. అడుక్కుతినే
వాళ్ళను అరికట్టవచ్చు. అక్షరాస్యతను పెంచవచ్చు.
ఇల్లు కట్టించవచ్చు. ఇంకా ఎన్నో చేయవచ్చు. అయితే ఈ అత్యవసరమయిన పనులన్నిటినీ అవతల పెట్టి ఆయుధాలు కొంటున్నారంటే అర్ధం ఏమిటి
? స్వార్ధమా పరమార్ధమా ? ఏమిటీ పిచ్చి ?
ఆగ్రరాజ్యాలు అని మనం ముద్దుగా పిలుచుకొనే అన్నలు ఎప్పుడైనా ముఖాముఖీ తలపడ్డారా? పైగా మోహరించిన బలగాలను తొలగించుకుంటూ
పరస్పరం సుహృద్భావ పర్యటనలు జరుపుకొంటున్నారు. మధ్యలో పిచ్చిపట్టి
తన్నుకుంటున్న వర్ధమాన దేశాలకు బుద్ధిలేనట్లే
గదా! తోటివాడు తొడ కోసుకుంటే మనం మెడ కోసుకోవాల్సిందేనని
ఈ దేశంలోని భూమి భక్తులు అనవచ్చు. వీరి విశ్వమానవత, ఏకాత్మత, అఖండత అనే నినాదాలు ఇప్పుడు వినరావు.
కోడిని
కోసి గోత్రానికంతా పగ అయినట్లుగా పాకిస్తాన్ సార్క్ దేశాల ఆగ్రహానికి గురి అయ్యింది. పాకిస్తాన్ పశ్చిమ జర్మనీ నుంచి పరమాణు పరిజ్ఞానాన్ని సంపాదించిందని రాజీవుడు పది మందిలో రోదించే కంటే ఆయుధాలు సమతూకంలో ఉంచుకోవటమే మేలు .
స్నేహం
సజావుగా సాగితేనే స్నేహం. కలిసినప్పుడు
కృత్రిమంగా నవ్వుకోవటం, చాటున గోతులు తవ్వుకోవటం. లేకపోతే
ఎవరికైనా చెప్పి ఏడ్చుకోవటం, ఇవన్నీ కొంపలు ఆర్పుకునే పద్ధతులే.
ఇలాంటి దొంగ స్నేహంకంటే నిర్మొహమాటమయిన ఎడబాటే
మేలు. క్రికెట్ అనీ, సార్క్ అనీ పాకిస్తాన్ ను దగ్గరకు చేర్చే ప్రయత్నాలు మాని, ఆ దేశంతో ఏ విషయంలో కూడా పొత్తు పెట్టుకోకుండా కొన్ని ఏళ్ళ పాటైనా మన ద్వారాలు మూసుకోవడం
మంచిదని నా అభిప్రాయం. పరస్పర స్నేహము, పరస్పర నిందారోపణ అనే విరుద్ధ విషయాలు కొనసాగేకంటే ఆ రెండూ ఆగిపోవటమే ఉత్తమం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి