పాతబస్తీ ప్రత్యేకతలు
గీటురాయి 24-3-1989
“పాతబస్తీ పరిస్థితి మరీ రోతగా
తయారయ్యింది. దాని రాత మారాలంటే
మంత్రులు, ఎమ్మెల్యేలు, పెద పెద్ద అధికారుల్ని అక్కడ నివసింపజెయ్యాలి.
వాళ్ళకు పాతబస్తీలోనే ఇల్లు కట్టించాలి” అని ఈ మధ్య నాదెండ్ల భాస్కర్ రావు అనే మాజీ ముఖ్యమంత్రి సెలవిచ్చారు. ఎవరబ్బా ఈయన? అంటూ ఆశ్చర్యపోయే పిచ్చి తమ్ముళ్ళెవరూ
ఈ తెలుగు దేశంలో ఉండరని నా నమ్మకం.
ఎందుకంటే నందమూరి
రాముడికి ఈయన అతిపెద్ద తమ్ముడుగా
ఆనాడు ఖ్యాతిగాంచాడు. ‘అసలు అన్న’ ఈయనే అయ్యేవాడుగానీ
పాపం కాలం కలిసిరాలేదు గనుక తమ్ముడి హోదా గూడా కోల్పోయి పాతబస్తీ లాగానే రోత
పట్టాడు. తన స్థితి, పాతబస్తీ పరిస్థితీ రెండూ ఒకేలాగ ఉన్నాయని గమనించాడు
కాబోలు ఈ కొత్త నినాదం అందుకున్నాడు.
అన్నా తమ్ముళ్ళంతా కలిసి గండిపేట వదిలి పెట్టి పాతబస్తీలో కుటీరాలు కట్టుకోవాలని పిలుపు నిచ్చాడు. పత్రికల వాళ్ళు ఈ పిలుపును అన్న చెవిలో వేశారు. “నాలి
ముచ్చువాడిని, నీళ్ళు నమిలే వాడినీ నమ్మరాదన్నారు పెద్దలు. వెన్నుపోటు పొడిచిన నాదెండ్ల సలహా నేను వినేదా?” అని అన్న విలేఖరులకు ఎదురు ప్రశ్న వేశాడు.“అన్న.
ఈసారి నాదెండ్ల నిజమే చెప్పాడు అని
మాత్రమే ఆలోచించాలి. నీ తమ్ముళ్లతో పాటు
పాత బస్తీలో మకాం పెట్టు” అని పత్రికలవాళ్లు ప్రాధేయపడ్డారు.
పాతబస్తీలో ఉండేంత రోతపని నేను చేయలేను గనుకనే గదా నాదెండ్ల ఈ వివాదం
లేపింది అని అన్న లోలోన పళ్ళు పటపటా కోరుక్కున్నాడు. పత్రికల వాళ్ళు చూస్తున్నారు
గనుక అ కోపం బయటకి కానరాకుండా
తమాయించుకున్నాడు. పాతబస్తీలోని రోతకు పాత ప్రభుత్వమే
కారణమన్నాడు. మజ్లిస్ పార్టీ అధికారంలోకి వచ్చింది గదా ఏం చేసింది అని నిలదీశాడు. ఆ మధ్య మేయరు అన్నం తినకుండా నా మీద అలిగినప్పుడు అన్ని కోట్ల రూపాయలిచ్చానే ఆ డబ్బంతా ఏం చేశారు అని ఎదురు
ప్రశ్న వేశాడు. పాతబస్తీ అభివృద్ధికోసం కులీకుతుబ్ షా అనే సంస్థను కూడా ఏర్పాటు చేశామన్నాడు.
అయినా పత్రికల వాళ్ళు తడిక దాసరుల్లాగా
తగులుకొని, అన్నా, ఆ సంస్థ డబ్బంతా మలక్ పేట రోడ్డు మీదనే పోశారు గాని పాతబస్తీ గోడు ఎవరూ వినటం
లేదన్నారు. మళ్ళీ కలుద్దాము నాకు షూటింగ్ పనులున్నాయని చెప్పి అన్న గండిపేటకు బయలుదేరాడు.
అప్పటినుంచి
పాతబస్తీ టాపిక్కు నన్ను కూడా ఆకర్షించింది. చెత్తాబజారు, చార్మినారు అంటే తెలుసుగాని ఇంకా లోపల ఉందట అసలు పాతబస్తీ అంటే. ఈ మధ్య నగర ఎన్జీవోల ఇళ్ల నిర్మాణ సహకార సంస్థ పేపర్లో ఒక ప్రకటన ఇచ్చింది. పాతబస్తీ వైపు తప్ప
జంటనగరాలకు ఎటువైపు నైనా సరే ఓ ఎనభై
ఎకరాల స్థలం కావాలని. పాతబస్తీ వైపు అయితే ఎందుకు వద్దంట ? అని ఓ ఉద్యోగిని అడిగాను. అటు మేముండలేమండీ అన్నాడు.
ఎందుకు
ఉండలేరో, అసలు దాని పరిస్థితులేమిటో స్వయంగా చూద్దామని
బయలుదేరాను.
శాలిబండ, మెహబూబ్ కి మెహంది, హుస్సేనీ ఆలం, టప్పాచబూత్ర, మంగళ్ హాట్, ధూలిపేట, దుమ్ముపేట,
దోమల పేట, మురుగు
పేట అలా రకరకాల ప్రాంతాలు తిరిగాను. బస్సులు
పట్టని గొందులు, వంకరటింకర సందులు, రోడ్ల మీద గోతులు, గోతుల నిండా మురికి నీళ్ళు,
వాటి మీద లాంగ్ జంప్ చేసే వాళ్ళు,
చిమ్మే బురద నీటికి అందకుండా రన్నింగ్ రేస్ తీసేవాళ్ళు. బురఖాల బూబమ్మలు, గోడల మీద ఆరెస్సెస్ వాళ్ళ రాతలు, తోపుడు బళ్ళు, నడిరోడ్ల మీద గోరీలు, మహంకాళీ ఆలయాలు, పచ్చజెండాలు పసుపు జెండాలు... అహహ !
ఇలా ఎన్నో దృశ్యాలు దర్శనమిచ్చాయి.
విశ్వామిత్రుడు ఆకలి బాధకు ఓర్వలేక కుక్క మాంసం
తినే ఘట్టాన్ని ఇక్కడ చిత్రిస్తే ఎంత సహజంగా ఉంటుందో గదా అనిపించింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి