ఏకులాగా వచ్చి...
గీటురాయి 14-4-1989
మనమంతా బానిసలం
గానుగలం పీనుగలం
వెనుక దగా, ముందు దగా
కుడి ఎడమల దగా దగా
మనదీ ఒక బ్రదుకేనా ? కుక్కల వలె నక్కల వలె
మనదీ ఒక బ్రదుకేనా ? పందులలో పందుల వలె
లేదు సుఖం, లేదు సుఖం, లేదు సుఖం జగత్తులో
బ్రదుకు వృధా, చదువు వృధా, పదవి వృధా, వృధా, వృధా !
అంటూ ఈ
తెలుగు దేశంలో మంత్రులు మొదలు ఎన్జీవోల వరకు, డాక్టర్లు మొదలు సినీ యాక్టర్ల వరకు, కాంగ్రెసు మొదలు కమ్యూనిస్టుల వరకు అందరూ ఒకటే పనిగా ఏడుస్తున్నారు. దారిద్రానికి మాటలెచ్చు తద్దినానికి కూరలెచ్చు అన్నట్లుగా తెలుగు దేశపు పెద్దన్న మొండిగా బండగా వాదిస్తూ కుర్చీ వదలకుండా కాలం నెట్టుకొస్తున్నాడు. జనం అయిదేళ్లు ఏలమని పదవిలో కూర్చోబెడితే మధ్య లోనే ఎందుకు దిగిపొమ్మంటున్నారని ఎదురు
ప్రశ్నిస్తున్నాడు. యావజ్జీవం జంట నగరాలలో
అద్దె ఇళ్ళలో ఖైదీలుగా ఉండవలసిన ఎన్జీవోలు మాకో సొంత గూడు కల్పించు మహాప్రభో అని ఎంత కాలంగా
మొరపెడుతున్నా వినిపించుకోని అన్న, ఆత్మాభిమానం అనే పదార్ధంతో నిమిత్తం
లేకుండా కేవలం అయిదేళ్లు మాత్రమే నగరంలో
ఉండే ఎమ్మెల్యేలకు ఇళ్ల స్థలాలు ఉగాది
వరంగా ప్రసాదించాడు. ప్రతి ఎన్జీవో రిటైర్ అయ్యే నాటికి అతనికో సొంత ఇల్లు కట్టించి గృహ ప్రవేశం దగ్గరుండి చేయిస్తామని తెలుగు దేశం ఎన్నికల ప్రణాళికలో చేసిన వాగ్ధానాన్ని గాలికి
వదిలేశాడు.
ఏకాదశినాడు
తల అంటుకుంటావేమిటి? అంటే అది నిత్య వ్రతము
నేడే ఆరంభించాను
అన్నాడట. మర్నాడు తల ఎందుకు అంటుకోలేదంటే నిన్నటితో వ్రతం సమాప్తి అయ్యింది అన్నాడట. అన్న
ప్రారంభించిన ఏ పధకమయినా ఇలా ఆరంభ శూరత్వంతో మొదలయ్యి అర్ధాంతరంగా ఆగిపోయి
అభాసు పాలవటం, కొనసాగినా, ఆర్భాటం జాస్తి ఆచరణ నాస్తి అన్నట్లుగా ఊగులాడుతుండటం పరిపాటి అయ్యింది. తన పాలనలో కేవలం రెండు రూపాయల బియ్యం తినేవాళ్లూ తప్ప మరో
రకం జనమే లేరని ఆయన గారి అభిప్రాయం
కావచ్చు. ఎదురు తిరిగి మెడలు వంచినప్పుడు తప్ప
ఆయా వర్గాలకు ఒక పట్టాన లొంగటం లేదు. ఈయన్ని నమ్ముకొని సహాయం కోసం ఎదురుచూచే ఏ వర్గమూ బాగుపడలేదు పైగా
ఏకుతో తాకితే మేకుతో మోదినట్లుగా ప్రతివాళ్లూ ఈయన చేతిలో పెడ దెబ్బలు తిన్నారు. ఏభయి నాలుగు రోజులు సమ్మె చేసినా, అసెంబ్లీ ఆవరణలోకి దూసుకెళ్లినా, ఆమరణ నిరాహార దీక్షలు చేసినా అన్న మనసు
కరగలేదు. పైగా నా తమ్ముళ్ళు తెలియక ఏదేదో
చేస్తున్నారని సర్ది పుచ్చి,
బుజ్జగించి, పెటాలున
మెడపై కొట్టినట్లుగా నాటకం నడిపించుకొస్తున్నాడు. మాటలతో మభ్య పెడుతున్నాడు. జీవితమన్నాక కొంతయినా సరసం ఉండాలంటున్నాడు.
ఆ సరసం విరసం కావటం గమనించటం లేదు.
జంట నగరాల్లో దోమల పెరుగుదలకు కారణమయిన
మూసీ నదిలో గడ్డి పెంపకాన్ని పదిహేను రోజుల్లో అరికడతాననీ, జీడిమెట్ల పారిశ్రామిక వాడ కాలుష్యాన్ని
కాలరాస్తానని శపథం చేసి వల్ల కాక ఊరుకున్నాడు. ఆ మూసీ
నది ప్రాంతంలోనే 9 వేల ఎకరాల ప్రభుత్వ భూమి అక్రమ ఆక్రమణకు గురయి గడ్డి పెంపకం సాగుతున్నదనీ, కనీసం అందులోనయినా ఓ వెయ్యి ఎకరాలు ఇళ్ళ స్థలాల కోసం ఇమ్మని ఎన్జీవోలు ప్రాధేయపడుతున్నారు. యాభయి ఎనిమిదేళ్ళ
ఆయుష్షు గల ఎన్జీవోల కంటే , అయిదేళ్ళ ఆయువు గల ఎమ్మెల్యేలు – లక్షలాది మురికివాడల జనం కంటే కోట్ల రూపాయల విలువ చేసే రాతి బొమ్మలు అన్నకు
అమూల్యంగా తోస్తున్నాయి. ఏకులాగా
వచ్చి మేకులాగా తేలటం అంటే ఇదేనేమో !
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి