మతాల పేరిట మంటలు
గీటురాయి 13-10-1989
“కందిరీగల పట్టు కడగిరేపగవచ్చు
మానిపింపగ లేము దానిపోటు
చెట్లలో బెబ్బులింజెనకి రావచ్చును
తప్పించుకొన లేము దాని కాటు
పరచునశ్వము తోకబట్టి ఈడ్వగవచ్చు
తప్పించుకోలేము దాని తాపు
కాకచే పొరుగిల్లు కాల్చి రావచ్చును
తన ఇల్లు కాపాడ తరముగాదు
దుర్ణయులు మీదెరుంగక దుండగమున
కార్యతతులెల్లజేసి తత్కార్యఫలము
లను భలింపుదురాయాయి అవసరముల”
అని ఓ కవి చెప్పిన నీతుల్ని నేటి నేతలు
లెక్క చేయటం లేదు. ఏదో ఒక సంచలనం
సృష్టించేపనికి, ప్రశాంతంగా ఉన్న దేశంలో అల్లకల్లోలం
రేపే పనులకు పాల్పడుతున్నారు. అలజడులకు ఆజ్యం పోస్తున్నారు. ఐక్యతకు, సఖ్యతకు
విఘాతాలు కలిగించి తమాషా చూస్తున్నారు. అందుకే ఒక కవి వీళ్ళను
గురించి ఇలా అన్నాడు.
“తెగే
వరకు దారంలాగి
ఆఖరిక్షణంలో చుట్టూ మూగి
అనునయ వాక్యాలు చెప్పటం
అదీ మనకు ఆచారం !
అప్పుడే మన మధ్య ఏర్పడింది
శత యోజనాల దూరం”
ఈ
మధ్య అఖిల భారత హిందూ న్యాయవాదుల సదస్సు అనే ఒక విచిత్రమైన సభ హైదరాబాదులో జరిగింది. అందులో మన స్పీకర్ నారాయణరావుగారు అత్యుత్సాహంతో పాల్గొని, అక్కడి వాళ్ళను చూచాక పొంగుకొచ్చిన
ఆవేశంలో కాబోలు, తన మనసులో దాగి ఉన్న ఒరిజినల్ భావాలను వెళ్ళగక్కారు.
ఈ
దేశంలోని ముస్లిముల్ని మైనారిటీలని రాజ్యాంగం ఎక్కడా పేర్కొనలేదని, కాశ్మీర్ కి ప్రత్యేక ప్రతిపత్తిని
రద్దు చేయాలని అన్నారు. ఇక దీని మీద
మమ్మల్ని మైనారిటీలు కాదంటావా అని ముస్లిం నాయకులు ఎగబడితే, అవి ఆయన వ్యక్తిగతమైన అసలు మాటలనీ, స్పీకర్ హోదాలో చెప్పినవి
కాదనీ చెప్పి తెలుగు దేశం నాయకులు చేతులు దులుపుకున్నారు.
నారాయణరావు కూడా అదే పాట పాడారు. గోల గోవిందుడిది అనుభవం వెంకటేశ్వర్లుది అన్నట్లుగా పదిమందీ కలిసి పిచ్చి నారాయణరావుని
ఆడిపోసుకొని గోల చేస్తున్నారు తప్ప మతోన్మాదం ఆవహించి
దురహంకారంతో ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకై అన్యాయమైన ఒక సదస్సు నిర్వహించిన న్యాయవాదుల్ని గాని, వాళ్ళకు అండగా నిలబడి చోద్యం
చూసిన రాజకీయ నాయకుల్ని గాని ఎవరూ పల్లెత్తు మాట అనటం లేదు.
ఈ
రకంగా న్యాయవాదులు కూడా మతం పేరుతో ఏకమై పోతుంటే ఇక
న్యాయం ఎక్కడ బతుకుతుంది ఈ దేశంలో ? గోకుడుకు గీకుడే మందు అనట్లుగా ఈసారి
ఇంకో మతానికి చెందిన న్యాయవాదులు గేదర్ అవుతారు. అలా
ఫలానా మతం డాక్టర్లు, ఫలానా మతం ఇంజనీర్లు, ఫలానా మతం పాకీవాళ్లు “సంఘాలు”
ఏర్పాటు చేసుకుంటారు. చతురతకు జాణకాడేగాని చేతిలో
చిల్లిగవ్వ లేదు అన్నట్లుగా ఈ మత సంఘాల మేధావుల సరసాలు, విరసాలు
దుమ్మెత్తి పోసుకోవటాలు భారీగానే జరుగుతాయి గాని భారతీయుల
ఐక్యతే గంగలో కలుస్తుంది.
వేరే పనీపాటా ఏమీ లేని సోమరిపోతులంతా ఒక
చోట చేరి తగాదాలు పెట్టేందుకు ఎదోదో
చెబుతుంటారు. కానీ ఈ దేశ సౌభాగ్యం కోసం పొలాలలో, ఫ్యాక్టరీలలో
దివా రాత్రాలూ కష్టపడి పని చేస్తున్న వ్యవసాయ కూలీలు, కార్మికులు
– వారుపడుతున్న శ్రమ – వారి దుర్భర జీవితాలు – ఈ కడుపు నిండిన మతమేధావుల కంట బడటం లేదా ? మతాల పేరిట మంటలు రేపే ఈ
రాజకీయ నాయకులకు దేశాభివృద్ధి మీద ఏ మాత్రం శ్రద్ధ ఉన్నదో అర్ధం కావటం లేదా ? మతాలన్నింటికీ అతీతంగా ఉండే “
భారతీయుల ఐక్యతను”
చీలదీస్తున్న నేతల బుద్ధులను ప్రజలు ఓ కంట కనిపెట్టాలి. వారి మాయలో పడి మాడి మసై పోకుండా శాంతియుతంగా బ్రతకాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి