13, నవంబర్ 2012, మంగళవారం

తెలుగు తుపాకులు



తెలుగు తుపాకులు
గీటురాయి 28-4-1989
            ఈడిగెముత్తికి జోడు శాలువలిస్తి
              కురుల గంగికి జరీకోకలిస్తి
              కడియాలు కుమ్మర కనికికి దర్శిస్తి
              పోగులు గోసంగి పోలికిస్తి
              పోచీలు చాకలి  పుల్లి చేతులవేస్తి
              దాని తల్లికి నూరు ధారపోస్తి
              దారచ్చికి దేవతార్చన లమ్మిస్తి
              గుర్రాన్ని ఉప్పరకోండి కిస్తి
              అనుచు పాత్రను పాత్రముననక ఇచ్చి
              చెప్పుకొందురు మూఢులు సిగ్గులేక

              అంటూ ఈ మధ్య కాంగ్రెసు వాళ్ళతో సహా అనేక ప్రతిపక్షాలవాళ్లు కసితీరా తిట్టుకొంటున్నారు. ఏమిటా సంగతి అని ఆరా తీస్తే అన్నగారు ఊరికో రెండు తుపాకులిస్తానని ప్రకటన చేశాడని తేలింది. ఎవరికిబడితే వాళ్ళకు తుపాకులిస్తే జనం బ్రతుకులు ఏంగాను అని ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు చెప్పి చూచినా ప్రయోజనం కలుగలేదు. నంది అంటే నందే పంది అంటే పందే అనే రకం గనుక ఈ తుపాకుల శాసనం కనీసం మధ్యాహ్న భోజన పథకం మోల్లోనైనా అమలై తీరుతుందని అందరూ భయపడుతున్నారు.

              నంగతుంగ నీళ్ళకుపోతే, నీళ్ళనీ ఒక రేవుకు వచ్చాయ. పిచ్చి       వాడి చేతిలో రాయి వాడికీ, వాడిచుట్టూ ఉన్న జనానికి కూడా ప్రమాదమేనని అన్న ఒప్పుకుంటున్నాడు. అందుకే ఊళ్ళోకెల్లా తెలివైన వాడికీ, మంచి పలుకుబడి గలవాడికీ, పరమ అహింసావాదికి మాత్రమే సదరు తుపాకీని కట్టబెడతానంటున్నాడు. మోచిన మోపునే తెగ మోసినట్లుగా మిగతా మంత్రులంతా అన్న పథకాన్ని తెగ మెచ్చుకున్నారు. నందమూరి వారి కవిత్వం కొంత నా పైత్యం కొంత అన్నట్లుగా ఆ పధకాన్ని గురించి ఎంతగానో నచ్చజెప్పారు. అయినా సరే ఎవరూ సంతృప్తి పడలేదు. అందరి కంటే ఎక్కువ ఆందోళన పోలీసుల్లో కానరావటం విశేషం. జనానికిచ్చిన తుపాకులన్నీ నక్సలైట్లు గుంజుకుంటే ఎలా ? చెరుకుపల్లి సంఘటన మరచిపోయ్యారా ? ఒకవేళ తుపాకులు దొరికిన జనమే మాపై వాటిని గురిపెట్టరని గ్యారంటీ ఏమిటి ? తుపాకులు ఎక్కువగా లభ్యం కావడంతో స్థానిక తగాదాలన్నీ హత్యాకాండలుగా మారితే ఎవరు ఆపగలరు ? అంటూ పోలీసులు తెగ ప్రశ్నలు గుప్పించారు.

              వంతుకు గంతేస్తే ఏదో దిగినట్లుగా దీని ఫలితం నిదానంగా అర్ధం అవుతుంది. అయినా అన్నగారి పథకాల పట్ల ఇం ఆందోళన చెందవలసిన అవసరం లేదేమో. ఇవ్వాళ్ళ తుపాకులిస్తాడు. రేపు తూటా ఒక్కింటికి ఇం పన్ను కట్టండి అంటాడు. దాన్ని పేల్చినందుకు ఇం ఫీజు ఇచ్చుకోమంటాడు. అసలా తుపాకీ కలిగి ఉన్నందుకు రోజుకింత జరిమానా వేస్తున్నానంటాడు. చివరికి ఎవడో ఆస్తి గల మొండివాడు తప్ప మిగతా వాళ్ళంతా తుపాకులు  వాపసు చేస్తారు. అన్నిటికీ తెగించే అలగాజమైతే వచ్చి తుపాకులు అమ్ముకొని జల్సా చేస్తారు. పని చెయ్యని తుపాకీ ఇచ్చినందుకు ఒకడు పరువు నష్టం దావా వేస్తాడు. దాని మరమ్మత్తు ఖర్చులు భరించమని కోర్టు ఆదేశిస్తుంది. పాత కక్షలున్న వాళ్ళు ఒకరినొకరు సఫా చేసుకుంటారు. రాష్ట్రంలో హాహాకారాలు చెలరేగి జనం అన్నను తిట్టిపోస్తారు. అన్న ఆలోచనలో పడతాడు. నావల్ల గదా ఇం అరాచకం చెలరేగింది. ఇన్ని ప్రాణాలు ఎగిరిపోయింది. దీనికి నేనే బాధ్యుడిని  నన్ను నేనే శిక్షించుకుంటాను అని రివాల్వర్ తీస్తాడు. తమ్ముళ్ళంతా కాళ్లావేళ్లాపడతారు. ఉరివేసుకోబోతారు. కణతలకు రివాల్వర్ లు ఆనించుకుంటారు. తమ్ముళ్ళకోసం అన్న ఆగిపోతాడు. తుపాకులు వాపసు తీసుకోండి అని ఆఙ్ఞాపిస్తాడు. వాటి మీద పెట్టిన డబ్బంతా వ్యర్ధమయ్యింది అని కాంగ్రెస్ వాళ్ళంటారు. వాటిని పోలీసులకిస్తున్నాం పొండి అంటాడు అన్న. తెలుగు బాల మహిళా బహిర్భూమి ప్రాంగణం, తెలుగు బాల మధ్యాహ్న భోజనం, లాంటి పథకాల్లాగానే ఈ తెలుగు తుపాకులు తుస్సుమంటే ఆశ్చర్యం లేదు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి