దారి తప్పినవాళ్లు
గీటురాయి 14-7-1989
వెన్నెలతో విందు చేయు పున్నమి
చంద్రుడవు నీవు
కళలు మాసి కాంతి బాసి గ్రహణం
పాలైనావా?
విరబూసిన చెట్టులాగా మురిసిపోవు నీ
బ్రతుకే
వాడి మాడి మోడుబారి వన్నె మాసిపోయిందా ?
ఎచటికోయి నీ పయనం ? ఏమిటోయి ఈ వైనం ?
ఏలనోయి ఈ ఘోరం ? ఎవరిపైనా నీ వైరం ?
అంటూ
పెడదారి పట్టిన వాడిని ప్రజలు పలు రకాలుగా ప్రాధేయపడతారు.
సరైన దారిలోకి రమ్మని సకలవిధాల చెప్పి
చూస్తారు కానీ వాడు పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అంటూ
మొండికేస్తాడు. దారి తప్పటంలో ఉన్న మజా
దారిలో ఉన్న వాళ్లకేం తెలుస్తుంది అంటూ దబాయిస్తాడు. జపం వదలి లొట్టల్లో పడ్డావేమిరా నాయనా అంటే జడ్డిగంలోనే మిడత పోటులాగా మీ గోల ఏంది పెద్దాయనా అంటాడు. ఒకవేళ కాళ్ళు చేతులు కట్టేసి కొట్లో పడేస్తే “
ఓర్వలేని ఈ ప్రకృతి ప్రళయంగా మారనీ, నా కిష్టంలేని ఈ కొట్టు తునాతునకలై
పోనీ, కూలిపోయి ధూళిలో కలిసిపోనీ, కాలిపోయి బూడిదే మిగలనీ ” అంటూ
పెద్దగా రోదిస్తూ శాపనార్ధాలు
పెడతాడుగానీ దారిలోకి రాడు. తాచెడ్డ కోతి వనమెల్ల చెరిచింది అన్నట్లుగా తన చుట్టూ పక్కలందరి మనో
నిబ్బరాన్ని దెబ్బతీసి క్రమంగా తన
పెడత్రోవలోకే గుంజటానికి ట్రై చేస్తాడు ఈ గుంజాటనలో లొంగిపోయిన జనం
చివరికి వాడికి వందిమాగదుల బృందంగా మారిపోయి సంచలనం సృష్టిస్తారు. మార్గం తెలియని మందలు
ఇలానే తయారవుతుంటాయి. దారి తప్పిన వాళ్ళ
వల్లనే వర్గాలు ఏర్పడుతుంటాయి.
గుణం
మానవే గూటాల పోలీ అంటే, నా మనువైనా మానుతాను గాని నా గుణం మాత్రం మానను అందట. అలాగే చెడ్డ
దారిలోనే మజా మరిగిననాడు ఇక ససేమిరా
సరికానంటాడు. మొదట్లో కొంచెం మొహమాటం, లజ్జ ప్రదర్శించేవాడు గాని రాను రాను సిగ్గు బిడియం చీమూ నెత్తురు లాంటివన్నీ వదిలేసి బాహాటంగా నిర్భయంగా చెడుదారిలో సర్కస్ ఫీట్లు చేస్తాడు. ఇలాంటి వారిని
మతస్తులంతా దారి తప్పినవారనీ, జారిపోయిన వారనీ, ముఠా మేస్త్రీలనీ అంటారు. వీళ్ళు కాస్త
బలపడి, పార్టీ సమావేశంలో తమ బలం ప్రయోగించి, అధికారంలో ఉన్న తమ సోదరులను క్రిందికి
పడదోస్తే, వీళ్ళనే వెన్నుపోటు దారులనీ, బాక్ బైటర్స్ అనీ అంటారు. అలా పడద్రోయకుండా వేరే కుంపటి పెట్టుకుంటే ఆత్మాభిమానులు అంటారు. ఇలా
తమ దారిలోకి రాకుండా పక్క దారులు పట్టిన వాళ్ళకు ఆయా వర్గాలవారు తమ పరిభాషలో రకరకాల పేర్లు పెట్టి పిలుస్తుంటారు.
అయితే ఆ
చెడిపోయినవాడు కూడా గురువుకు తిరుమంత్రం నేర్పినట్లుగా తన మార్గంలోని మజా గురించి పైవాళ్ళకు నచ్చజెప్పజూస్తాడు.
గురువులు వస్తున్నారంటే ఇంకేం గోచీలు
విప్పి తోరణాలు కట్టండి అని తన మందను
పురమాయిస్తాడు. గుడ్లగూబను చంకలో పెట్టుకుని సమావేశాలకు పోయినట్లుగా ఉంటుంది అధ్యక్షులవారి
పని. ఈ మధ్య వివిధ పార్టీల సమావేశాలలో
దారిలో ఉన్నవాళ్ళు, దారి తప్పినవాళ్లు తెగతన్నుకుంటున్నారు.కొన్ని పార్టీలలోనైతే ఇదొక సంప్రదాయం అయిపోయింది.
అసలు తన్నుకోవటమే మా సంస్కృతి అంటున్నారు.పైగా మా పార్టీలో ఎంతో స్వేచ్చ ఉంటుంది.అదే మా ప్రత్యేకత అంటున్నారు.పార్టీ లోపల ఎంతగా తన్నుకున్నా బయటకొచ్చేసరికి మేమంతా ఒకటేనంటారు.తడిక నెట్టింది ఎవరంటే ఆలులేని వాడన్నట్లుగా
ఆయాపార్టీలు తమలోని అసమ్మతి వాదుల పట్ల
ఉదారంగా వ్యవహరించి అనేక రాయితీలు కల్పిస్తున్నా వీళ్ళు మాత్రం తప్ప తాగి కులం మరచినట్లుగానే ప్రవర్తిస్తున్నారు. సృష్ట్యాది
నుండి దారి తప్పటం అనే లక్షణం నవయవ్వనంతో
నిత్యనూతనంగా ఉంటూ వస్తోందని అభిజ్ఞుల ఉవాచ. దారి తప్పినవాళ్ళ
వల్లనే దారిలో ఉన్నవాళ్ల బొక్కలు బయటపడతాయని మరికొందరి అభిప్రాయం. ప్రజాస్వామ్య దేశంలోని ప్రజలారా, ఇదేమిటో మీరే ఆలోచించండి !
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి