పుండు ఒక చోట మందు ఇంకొకచోట
గీటురాయి 29-9-1989
“ అన్యాపకృతి వాని కాధారభూతంబు
దుర్బుద్ధి వానికి తోడు నీడ
దారుణత్వము వాని తలపై కిరీటంబు
పరదూషణము వాని పంటచేను
అన్యాయవృత్తి వాడభ్యసించిన విద్య
బంధువైరము వాని పట్టుకొమ్మ
ప్రాణి హింసాకర్మ వాని నిత్య జపంబు
పాపశీలము వాని పాలి సొమ్ము
అనుచు లోకులు తన్నాడు కొనుచునుండ
బ్రతుకు మనుజుని కన్నా గార్ధభము
మేలు “
అని
వంకాయలపాటి వెంకటకవి సూత్రీకరించాడు. కానీ గాడిద ఇలాంటి
దుర్మార్గపు పనులు ఎన్నడూ చేయదు. పైగా తలవంచుకుని ఎంత బరువైనా మోసుకుంటూ పోతుంది. కొన్ని సార్లు అతి విశ్వాసంతో కుక్క చెయ్యాల్సిన పని కూడా తానే చేసి ఉచితార్ధంగా
దెబ్బలు తింటుంది. అలాంటి గాడిద ఫలానా
వాడికంటే మేలు అని పోల్చటం గాడిద వింటే “చీ, ఇంత అన్యాయపు పోలికా” అని చీత్కరించుకుంటుంది. మనసు వికలమై, గుండెలో తెమిలి తుపుక్కున ఊస్తుంది.
అయితే
వంకాయలపాటి వెంకయ్యగారు సెలవిచ్చిన సులక్షణాలతో విరాజిల్లుతున్న
వారు ఎవరై ఉంటారో కాస్త ఆలోచించండి. అన్యాపకృతి, దుర్బుద్ధి, దారుణత్వము, పరదూషణము, అన్యాయవృత్తి, వైరము, ప్రాణి హింసాకర్మము, పాపశీలము అనే అష్టగుణాలతో అలరారే
మనుషులు మీకెక్కడైనా కనిపించారా ? పైగా ఈ ఎనిమిది గుణాలు మూర్తీభవించిన వారిగా జనం వారిని గుర్తించి
చీత్కరిస్తున్నా నిక్షేపంగా నిర్లజ్జగా బ్రతికేయగల స్థైర్యం కూడా వారిలో పుష్కలంగా ఉంటుంది. వీరి
బారిన పడకుండా రక్షించమని
దేవుణ్ణి శతవిధాలా ప్రార్ధించటం ఇప్పుడు జనం అలవాటు చేసుకున్నారు. వాళ్ళ కంటపడకుండా పారిపోవడం నేర్చుకున్నారు.
కమాన్
పూర్ మండలంలోని కన్నాల గ్రామానికి చెందిన రమేష్ అనే అమాయకుడిని రాడికల్ అనే అనుమానంతో పట్టుకెళ్లి లాకప్ గదిలో చిత్రహింసలు పెట్టి చంపి తరువాత “పొరపాటున
ప్రాణాలు తీశాము, సారీ” అన్నారట.
(ఆంధ్రప్రభ 15-9-1989)
పాలు
పిండగలం గాని తిరిగి చంటిలోకి ఎక్కించగలమా ? ప్రాణం తియ్యగలం
గాని తిరిగి బ్రతికించగలమా? మీ ఇంట్లో బ్రతికున్న ఎవరో ఒకడికి ఉద్యోగం ఇప్పిస్తాంలే ఊరట చెందండి అని
సముదాయిస్తున్నారట. కానీ పామకాటు చీరతో
తుడిస్తే పోతుందా ? అసలు మీ స్వభావమే మారాలి, మీరు మంచి మనుషులుగాను మానవతావాదులుగాను మారాలి అని ప్రజలు ఘోషిస్తున్నారు. ఇప్పుడు తాజాగా కాదు ఎప్పటినుండో వారికి మొరపెడుతున్నారు. నిందితుల్ని కోర్టులో హాజరుపరచండి,
వాళ్ళను చిత్ర హింసలు పెట్టి చంపవద్దు అని అనేక విధాల ప్రాధేయపడుతున్నారు. అయినా
లాకప్ మరణాలు గాని, లాకప్ గదుల్లో దారుణమైన హింసాకాండగాని ఆగటం లేదు. పుండు ఒక చోట మందు ఇంకొక చోట అన్నట్లుగా ప్రభుత్వం తలపెట్టిన సంస్కరణలన్నీ బూడిదలో పోసిన పన్నీరులాగా అయ్యాయి. పౌరహక్కులు అంటూ
అనేకమంది చేసే గొడవ అంతా అరణ్యరోదనలాగా ఉంది.
ఇప్పటికైనా
ప్రభుత్వం కళ్ళు తెరిచి పోలీసుల సంస్కరణ కోసం కొన్ని చర్యలు చేపట్టాలి. నేరస్థుల
సంస్కరణలాగానే ఈనాడు పోలీసుల సంస్కరణ కూడా ఆవశ్యకం అయ్యింది. లాకప్ మరణాలకు కారకులయిన
పోలీసులందరినీ డిస్మిస్ చేయటమేగాక, వారి మీద న్యాయపరమైన చర్యలు తీసుకుని జైళ్లకు పంపాలి. పోలీసులు చేసే హింసను
ప్రభుత్వ హింస అంటారు గనుక పోలీసుల దురాగతాలు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తాయి.
ఎలక్షన్లలో గెలవకుండా చేస్తాయి గనుక
ప్రభుత్వ అధినేతలు జాగ్రత్తపడాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి