కనకలింగం – శంభులింగం
గీటురాయి 15-12-1989
శౌర్యముంటే శత్రుసేనల మీదకు పోయేనాడు చూపించాలి. విద్య ఉంటే
సభాంతరాళంలో
వాదించాలి. కవిత్వం ఉంటే ద్రోహకారి
మూర్ఖుల్ని తిట్టే సమయంలో
ప్రకటించాలి. ధైర్యం ఉంటే మహావిపత్తు ప్రాప్తించిన కాలంలో అగుపించాలి. అలా అగుపించక పోతే చచ్చుపీనుగులే గానీ వీళ్లొక పూజ్యులా ఈ భూమ్మీద? అని ఒకాయన జనాన్ని ఎత్తిపొడుస్తాడు.
అయితే మన జనం శౌర్యం, ధైర్యం, ఙ్ఞానం అన్నీ అగుపింపజేసారు. ఓటు వేసే కాలంలో తమ విజ్ఞత
నిరూపించుకున్నారు. మామూలు రోజుల్లో రాజకీయ నాయకుల కళ్ళకు చచ్చుపీనుగల్లా కనబడే జనం, ఓట్ల సమయానికి పూజ్యులుగా, ఆరాధ్య
దైవాలుగా మారిపోతారు.నలభై కోట్ల దేవుళ్ళు దేశం మీద తమ ప్రతినిధుల్ని ఎన్నుకున్నారు. మొక్కటానికి
వచ్చిన కొంతమందిని ముక్కు పగిలిందాకా
తన్నారు. తొంభై తొమ్మిదిమంది పోగై రాజకీయ నాయకుల తోళ్ళు తెగకోశారు. రాజకీయ నాయకులంతా తలకాయ లోపల దూర్చిన తాబేళ్లలాగా
ఉన్నారు. కాబట్టి సరిపోయింది మరో రకంగా ఉంటే ఏమయ్యేదో ! ఏమైతే ఏముంది జనం తమ వల్లయిన పని చేశారు. కానీ తలగడ
తిరగ వేసినంత మాత్రాన తలనొప్పి పోతుందా ? పార్టీలు మార్చినంత మాత్రాన పాలకుల్లోని అవగుణాలు నశిస్తాయా ? అవి పారంపర్యాచారంగా వస్తూనే
ఉన్నాయి. తప్పెట కొట్టిన వాడు దాసరి, శంఖమూదిన వాడు జంగము అన్నట్లు
వేషాల మార్పేగాని,
దేశాభివృద్ధి విషయంలో ఏం మార్పూ రావటం లేదు.
తల
ఊపినందుకు తాంబుర్ర ఇచ్చి పొమ్మనట్లుగా ఎన్నుకున్న నేరానికి ఎన్ని ఘోరాలు చేశారో జనం చూశారు.
తన్ను తాను పొగడుకుంటే తన్నుకుని
చచ్చినట్లుంటుంది. అన్నగారి అహంభావ పాలన అలానే ముగిసింది.
తన్నుగట్ట తాళ్ళు తానే తెచ్చుకున్నాడు. ఆయన అభిమాన సంఘాల బలం ఏ పాటిదో ఇప్పటికీ తలకెక్కి ఉంటుంది.
జ్యోతిష్కుల వారి మాటలు విని పార్లమెంటుకు
అసెంబ్లీకి ఒకేసారి ఎలక్షన్లు పెట్టించాడు. గ్రహాలు
గతి తప్పాయి. పాపం ! అసలు అన్న ఒక్కడేకాడు ఇప్పుడొచ్చిన చెన్నారెడ్డి లాంటి నాయకులెంతో మందికి తమ మీద కానీ, ప్రజల మీదకానీ నమ్మకం లేదు. కానరాని గ్రహాల అనుగ్రహం మీదనే నమ్మకం ఉంది. బోఫార్స్
లావాదేవీల్లో ముడుపులు మింగిన కల్మషం బాబాల పాదదీవెనల వల్ల
పోలేదు. కాషాయాన్ని గాని, బాబాల ఆశీర్వాదాల్ని గాని జనం లెక్క చేయలేదు. కన్నేలపోయెనోయి కనక లింగామా అంటే చేసుకున్న కర్మమోయి శంభులింగమా అని రామారావు, రాజీవ్ గాంధీలు ఒకరినొకరు ఓదార్చుకోవాలి. చెప్పింది చేయబోకురా, చేసేది చెప్పబోకురా అనే రీతిలో మిస్టర్
క్లీన్ పాలన పరమ డర్టీగా మారిపోయింది. ఇక రెండు రూపాయల బియ్యంతోటే
రాష్ట్ర ప్రజల దరిద్రం తీరిపోతుందని ఇంత పెద్ద ఘనకార్యం చేసే నేనే
నిజమైన కమ్యూనిస్టునని అన్న చెప్పీ చెప్పీ అలిసి పోయాడు. రాగి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే బిడ్డలు పుడతారని చెబితే చుట్టు చుట్టుకూ పొట్ట చూసుకుందట ఒక చాదస్తపు మనిషి. రెండు రూపాయల బియ్యానికి ఏ
పాటి మహత్యం ఉందో అన్నకు ఇప్పుడు చక్కగా అర్ధమై ఉంటుంది.చెరకు నమలటానికి కూలి అడిగే రకాలను జనం ఎంత కాలం భరిస్తారు ?
పాలకుల్ని
అక్కడా ఇక్కడా మార్చారు. కానీ వాళ్లలోని ముఠాలను
మట్టు
బెట్టలేకపోయారు. అయ్యే పూజ అవుతూ ఉండనీ, ఊదే శంఖం ఊదేస్తాం
అంటూ ఎక్కడికక్కడ ఎగస్పార్టీ వాళ్ళు తయారై తన్నుకుంటున్నారు. అవ్వాల్సిన పనికి అరఖత్తు కాని పనులకు కుమ్మక్కు అవుతున్నారు. అడ్డేటు మీద గుడ్డేటు అన్నట్లుగా పరిస్థితి రాను రాను కుక్కల
పోట్లాట లాగా తయారౌతున్నది. అడ్డ బొట్టు వాడు నిలువు బొట్టు వాడు పోట్లాడుకొని సత్రం తగులబెట్టారట. దేశానికి ఏంగతి పడుతుందో ఎవరి పాలన ఎలా ఉంటుందో ఇక చూచి తీరాల్సిందే !
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి