న్యాయవాదుల అన్యాయం
గీటురాయి 23,30-12-1988
కుక్కను
అందలం మీదికెక్కిస్తే కుచ్చులన్నీ తెగ కొరకదా ? పిల్లిని గద్దె మీద పెట్టి పూజిస్తే ఎలుకలను తినటం
ఆపివేస్తుందా ? చెక్కెర ముక్కలు వేసి
కాకిని పెంచితే కారుకూతలు కూయటం మానుతుందా ? దున్నపోతుకు ఎన్ని
వన్నెలు దిద్దినా బురద గోతులలో పొరలకుండా ఉంటుందా? నీచుణ్ణి గొప్ప బిరుదు ఇచ్చి పిలిచినా
వాడి గుణం చూపించకుండా ఉంటాడా? ... అంటూ ఒకాయన సవాలక్ష అలంకారాలతో ఒక న్యాయవాదిని తిట్టి పోస్తున్నాడు. సంగతేమిటి అని అడిగాను. కట్నం కోసం భార్యను వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేస్తే ఆ(అ) న్యాయవాదిని పోలీసులు
అరెస్టు చేశారట. న్యాయశాస్త్రంలో పట్టా పొందినంత మాత్రాన న్యాయవాది
కాలేడని, వాని లోని స్వభావమే మారాలని, న్యాయం పక్షాన నిలబడివలసిన న్యాయవాదులే ఇలా కట్నాల కోసం భార్యలను రాచిరంపాన పెడుతున్నారంటే
ఇది న్యాయవృత్తికే కళంకం అని ఆ పెద్ద మనిషి ఆక్రోశించాడు. ఆయన కూడా లాయరే.
ఇలాంటి
అన్యాయపు అడ్వకేట్లు న్యాయస్థానాలలో కొనసాగటం
చూస్తే పంది కొక్కును పాతరలో పెట్టినట్లుగా ఉందనే
సామెత గుర్తుకొచ్చింది. నోరు కల్లల పుట్ట
పేరు హరిశ్చంద్రుడు అన్నట్లుగా పేరు న్యాయవాది
చేసేవి దుర్మార్గపు పనులు. భార్యల దగ్గర కట్నం గుంజటమొక్కటే కాదు . క్లయింట్ల దగ్గర నుండి భారీగా ఫీజులు గుంజటంలో కూడా ఆరితేరిన మొండి న్యాయవాదులు
కొందరున్నారు. అందరూ కాదు (కొందరు).
అనుభవించిన వాళ్ళ నడిగితే పట్టిస్తారు. వీళ్ళు కేసును తేలనివ్వరు. వ్యవహారం ఎంతవరకు వచ్చిందో చెప్పరు. క్లయింటుకు చెప్పేదొకటి
కోర్టులో చేసేదొకటి. ఏళ్లూ వూళ్లూ గడిచి ఎంతో డబ్బు ఖర్చయి ఇంటికెళ్ళి ఏడ్చుకునే వారు కొందరయితే కోర్టు ఆవరణలోనే ఏడ్చేవారు
కొందరు. ఇలా గెలిచిన వాడూ ఓడిన వాడూ ఇద్దరూ ఏడ్వడానికి కారణం నిజంగా
కోర్టు ఖర్చులు కాదు, ప్లీడరు ఖర్చులే. పేదవాళ్ళకు కోర్టు ఫీజు లేకుండా చేయాలని ప్రభుత్వం ఆలోచన. ప్లీడరు
ఖర్చు లేకుండా చేసే మార్గమేదయినా ఉందేమో ఆలోచిస్తే మరీ బాగుంటుంది. ఎందుకంటే వాది ప్రతివాదుల్ని దివాలా తీయిస్తున్న ఖర్చులలో అధిక భాగం న్యాయవాదుల ఫీజులేగదా
!
కర్ణునితో
ఉందమ్మా భారత యుద్ధం అంతా అన్నట్లుగా కోర్టు వ్యవహారమంతా న్యాయవాదితోనే ముడిపడి ఉంటుంది. న్యాయస్థుల పక్షాననే వ్యాజ్యాన్ని స్వీకరించటం, న్యాయం రాబట్టటానికి తన బుద్ధి కుశలతను ఉపయోగించటం, విశేషమయిన వాదనా పటిమను కనబరచటం, అన్యాయం జరిగిన వాడికి
ప్రతిఫలాన్ని కలిగించటం న్యాయవాది పరమాశయాలు.
ఈ సదాశయాలకు తిలోదకాలు ఇచ్చి న్యాయాన్ని అమ్మేవాడు దారులు కొట్టేవాడు ఒకటేనని సామెత.
న్యాయం చెప్పరా నాగిరెడ్డి అంటే నాకు ఇద్దరు పెళ్లాలే అన్నాడట. న్యాయవాదుల శీలసంపద, సద్వర్తన ఇలా తగలబడితే ఇక క్లయింటులు ఏం చెయ్యాలి ? ఎవరిని ఆశ్రయించాలి ?
న్యాయవాదులు బారుల్లో, జూదగృహాల్లో, వేశ్యావాటికలలో దర్శనమిస్తే సామాన్య జనం ఏమనుకోవాలి ? పది మందికి బుద్ధి చెప్పవలసిన న్యాయవాది కట్నం కోసం భార్యను వేధించి చంపాడంటే అతను
చదివిన న్యాయ విద్య అతనిలో ఏ మాత్రం
మార్పు తేలేకపోయిందన్న మాట. న్యాయమూర్తులన్నా కనీసం ఈ విచిత్రమేమిటో ఆలోచించాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి