దూరదర్శనీయం
గీటురాయి 19-5-1989
“కుక్షింభరుని బుథ రక్షా పరుండంచు
అతి నికృష్టుని మహాత్యాగి యనుచు
బహుబీజ సంభవుని పరమ పావనుడనుచు
చంచలాత్ముని ధైర్యశాలియంచు
దౌర్జన్యకారిని ధార్మికోత్తముడంచు
కఠిన చిత్తుని దయాకరుడటంచు
జారకర్ముని పరదార వర్జితుడంచు
ఉత్త మూఢుని శాస్త్రవేత్తయంచు
కవులు కక్కూర్తి చేతను కడుపుకొరకు
సన్ను తింతురు మదిలో విచారపడక”
అంటూ ఒక
కవి మదన గోపాలుడి దగ్గర మధనపడతాడు. ఈ మధ్య దేవీలాల్ కూడా ఇలానే రేడియో, టీ.వీ ల మీద విరుచుకుపడ్డాడు. “
ఆ ఆకాశవాణి మీ నాలికలపై నాట్యమాడే రాణి. మీరు పాడించే పాటను పాడే గాయక చూడామణి ” అంటూ కేంద్రంలోని కాంగ్రెస్
ప్రభుత్వాన్ని ఆడిపోసుకున్నాడు. అసలు
వార్తల సమయం వచ్చిందంటే రేడియోలు,
టీవీలు కట్టేయండి అంటూ జనానికి సలహా
గూడా ఇచ్చాడు. కారణం ఏంటయ్యా అంటే వాటిల్లో దేశ వార్తలు కాకుండా కేవలం
కాంగ్రెస్ పార్టీ వార్తలను మాత్రమే చెబుతున్నారనీ,
రాజీవ్ గాంధీని ప్రజలకు నిర్భందంగా చూపిస్తున్నారనీ ఆయన వాపోయాడు. కంచరి వాని ఇంట్లో పిల్లలు తాటాకు చప్పుళ్ళకు
బెదరనట్లుగా కాంగ్రెస్ వాళ్ళు గాని, దూరదర్శన్ వాళ్ళు గాని దేవీలాల్
మాటలకు ఏమీ విలువ ఇవ్వలేదు. పైగా కాంగ్రెస్
కీర్తిని మరింత పొగిడారు. రాజీవుని భజన కార్యక్రమాలు విస్తృతం
చేశారు. ప్రతి పక్షాలవాళ్లను వీలు
దొరికినప్పుడల్లా పడదిట్టారు.
ఎన్టీఆర్, ఎమ్జీఆర్ లాంటి వాళ్ళు సినిమా యాక్టర్
లయితే, రాజీవ్ గాంధీ టీవీ యాక్టర్ అని కొంత మంది ప్రతిపక్ష నాయకులు అభిప్రాయపడ్డారు. ఓ కన్ను పూవు కన్ను ఇంకో
కన్ను కాయ కన్ను అన్నట్లుగా ప్రభుత్వ
ప్రచార సాధనాలైన రేడియో, టీవీలు రెండూ చెడిపోయాయని వారు ఆందోళన వెలిబుచ్చారు. వాటికి స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని కోరారు. మీరు అధికారంలోకి వచ్చినా ఆ
పని చెయ్యరు. జనతా హయాంలో వాటికి
ఏమాత్రం స్వయం ప్రతిపత్తి ఇచ్చారు అని కాంగీయులు ఎదురు
దెబ్బకొట్టారు. “తెలుగు సమాచారం”
లో అన్న బాకా ఊదించుకోలేదా అని ఆవేశపడ్డారు.
ఏతా
వాతా తేలిందేమిటంటే, ఏ పార్టీ ప్రభుత్వంలో ఉంటే ఆకాశవాణి దూరదర్శన్ లు ఆ పార్టీకే బాకాలుగా ఉంటాయి. ఉండాలి. పైకి చెప్పరు గాని అధికారంలో ఉన్న వాళ్ళు అంతరంగంలో కోరుకునేది
ఇదే. కాయితం మీద ఆర్డర్లు జారీ చేసి వైర్
లెస్ సందేశంలో వాటిని రద్దుచేసినట్లుగా, ఇలాంటి వన్నీ
ఓరల్ గా ఉంటుంటాయి. ఒత్తి పలకవే వైదీకపుపిల్లీ అంటే మ్రావ్ మ్రావ్ అందట. అలానే ఆకాశవాణి దూరదర్శనాలు అనుమతి వచ్చిందే చాలని అధికార పార్టీని ఆకాశానికేత్తేస్తూ, ప్రతి పక్షాలను పాతాళానికి తోక్కేసే ప్రచారాన్ని మహాద్భుతంగా నిర్వర్తించాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి