స్పెషలిస్టుల స్పెషాలిటి
గీటురాయి 28-10-1988
వెదికి
వెదికి బండ్లమీద వంటలక్కను తీసుకొస్తే, తగిలేను మిగిలేను తోటకూరకు తొడలోతు ఎసురు పెట్టండి అన్నదట.
ఏ రంగంలో నయినా స్పెషలిస్టులు అనే వాళ్ళ
సంగతి రాను రాను ఇలానే తయారవుతున్నది. మామూలు ఆరెంపీ డాక్టరు నాలుగు బిళ్లలతో తగ్గించే జబ్బును, స్పెషలిస్టుకు
చూపిస్తే ఎక్స్ రేలు, రక్త పరీక్షలు, మూత్ర పరెక్షలు, స్కానింగ్లు చట్టుబండలూ అంటూ ఖర్చు తడిసి మోపెడవుతున్నది.
కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా
పెట్టుకున్న స్పెషలిస్టులు మాత్రం అవసరమున్నా లేకపోయినా
సకల పరీక్షలు జరిపో, లేక జరిపినట్లు నటించో తప్పని సరిగా డబ్బు గుంజుతారు. జబ్బు తగ్గకపోగా అనవసర ప్రయోగాల వల్ల మరింత విషమించిన సంఘటనలున్నాయి. విస్తరి చిన్నది
వీరమ్మ చెయ్యి పెద్దది అన్నట్లుగా ఈ
స్పెషలిస్టులు జనాన్ని పిండుతున్నారు. వీసెడు
చింతపండు పాసంగానికే (దాళా,
పడికట్టు) సరిపోయిందన్నట్లుగా తీసికెళ్లిన డబ్బంతా కన్సల్టెన్సీకి, ఆరోగ్య పరీక్షలకే హారతి అయిపోగా, అవసరమయిన మందు ఒంట్లోకి పోవటానికి అదనంగా ఎంతో కావలసి వస్తున్నది. కొన్ని సార్లు మందు ఖరీదు కంటే, ఆ మందు పేరు రాసివ్వటానికిచ్చిన ఫీజే ఎక్కువగా ఉంటుంది.
బిడ్డ ఎదిగితే కుండ ఎదుగుతుంది అన్నట్లుగా ఎంత పెద్ద డిగ్రీ ఉంటే పుచ్చుకునే ఫీజు కూడా అంతగా ఎదుగుతూ
ఉంటుంది.
వెయ్యిళ్ళ
పూజారి వెదికినా దొరకడన్నట్లుగా ఈ మాత్రం స్పెషలిస్టు ఈ ప్రాంతంలోనే లేడు అంటూ అక్కడ క్యూలు కట్టే జనానికి
కొదువలేదు. అవును. స్పెషలిస్టును వదిలి మామూలిస్టును కన్సల్ట్ చెయ్యటం అవివేకమే అవుతుంది మరి. గుడ్డలు కుట్టటంలో గోరింటాకు పెట్టటంలో, బియ్యంలో రాళ్ళు ఏరటంలో, సలహా లివ్వటంలో, బాకా ఊదటంలో,
వంగి వంగి దండాలు పెట్టడంలో,.. ఇలా అన్ని పనుల్లో స్పెషలిస్టులున్నారు.
కాకపోతే వారికిచ్చుకోవాల్సిన దక్షిణ
కొంచెం ఎక్కువగా ఉంటుంది. దానికి భయపడగూడదు.
మన రేడియో, దూరదర్శన్ లను చూస్తే అవి ఏ విషయంలో స్పెషలిస్టులో ఇట్టే చెప్పెయ్యవచ్చు.
సరే అసలు
విషయానికొద్దాం. స్వాజీలాండ్ ప్రభుత్వం తమ దేశంలో పొదుపు
ఎలా చెయ్యాలో మార్గాలను సూచించమని బ్రిటన్ నుంచి ఓ స్పెషలిస్టును ఆహ్వానించింది. ఆయన బోలెడంత, ఫీజు పుచ్చుకొని ఆరు వారాల పాటు “అయిదు
నక్షత్రాల హోటల్లో” విడిది చేసి,
విందులు మందులతో కాలక్షేపం చేసి వెళుతూ
వెళుతూ, ప్రభుత్వోద్యోగుల జీతాలన్నిటినీ సగానికి సగం కోసెయ్యండి, బోలెడంత డబ్బు మిగులుతుంది అని చక్కని చిట్కా చెప్పి పోయాడట. ఈ పాటి ఆలోచన చెప్పటానికి ఈ ఘనుణ్ణి
ఇంగ్లాండు నుండి రప్పించాలా ?
నన్నడిగితే చెప్పలేకపోయే వాడినా అన్నాడట ఓ గ్రామీణుడు. మూడు పావలాల గుడ్డ ముప్పై రూపాయల కుట్టు అన్నట్లుగా ఉందీ వ్యవహారమంతా అని స్వాజీలాండ్ అధికారులు ఆఖరుకు తెలుసుకుని విలపించారు. అయ్యాలారా, నేను కూడా
ఈ మధ్య ముప్పై రూపాయల ఫీజు ఇచ్చి కేవలం మూడు రూపాయల
మందు రాయించుకొచ్చుకున్నాకనే ఈ విషయం అర్ధమయ్యింది.
కాబట్టి అయిందానికీ కాని దానికీ, చిన్న చిన్న విషయాలకు కూడా
స్పెషలిస్టుల్ని సంప్రదించనవసరం లేదని మీకు సలహా ఇస్తున్నాను. -నూర్ బాషా రహంతుల్లా
గీటురాయి 28-10-1988
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి