బహుపరాక్ ! బహుపరాక్
గీటురాయి 7-4-1989
చతుస్సముద్ర ముద్రిత ధరామండల
సామంత రాజ సంసేవిత
దిగ్ధిశాంత యశోవిరాజిత సార్వభౌమా !
సనాతన ధర్మ ప్రతిష్టాపకా, కాషాయవస్త్ర పరివేష్టితా !
ఆసేతు శీతనగ పర్యంత చండశాసనా !
ఆహా ఆంధ్రభోజా ! రాజాధిరాజా !
మార్తాండతేజా !
కలియుగ భీమా ! శ్రీ శ్రీ శ్రీ
నందమూరి తారకరామా !
బహుపరాక్ ! బహుపరాక్ ! బహుపరాక్ !
అంటూ వంగి
వంగి దండాలు పెట్టి, పాదాలు పట్టి, కొబ్బరి కాయలు కొట్టి, చెయ్యెత్తి జై కొట్టిన తెలుగు తమ్ముళ్ళు కొందరు తమ మంత్రి పదవులు ఊడగానే,
ఊడగొట్టిన మంచం కోళ్ళలా మిగిలి,
వాస్తవ లోకంలోకి వచ్చి, మత్తు విదిలించుకొని నిజం తెలుసుకొని నోళ్ళు తెరిచారు. మురికి
కాల్వని మానస సరోవరమని, ముసలి ఏనుగుని ఐరావతమని, చీమ తలకాయంత
పాలకుని దేశానికే కాబోయే సార్వభౌముడనీ తెగపొగడి ఇంతకాలం మా
పొట్టలు నింపుకున్నామేగాని, మా తలకాయల నిండా మట్టి పట్టిందే అని నేడు విచారిస్తున్నారు. మంత్రి పదవులు తమ మతులు ఎలా పోగొట్టాయో ఇప్పుడు తెలుసుకుంటున్నారు.
తమ మాజీ బ్రతుకంతా పరాధీనమై, పుంగనూరు సంస్థానంలోనే గడిచిందనీ, ఆనాడు తమకు సిగ్గూ, శరమూ చీమూ నెత్తురూ, ఆత్మాభిమానం లాంటి పదాలు అర్ధమయ్యేవే
కావనీ, ఈ మధ్యనే అదీ మంత్రి పదవులు పోయి మతిస్థిమితం కలిగాకనే ఆ మాటల్లోని యదార్ధత
అర్ధమయ్యిందనీ వాళ్లంటున్నారు. విలేఖరులంతా తగులుకొని ఏమిటి విషయం
అని అడుగుతుంటే బలే తమాషాగా
సమాధానాలు ఇస్తున్నారు. సముద్రంలో చెక్కెర కలిపినట్లు మంచి పన్నీరు దెచ్చి బూడిదలో కుమ్మరించినట్లు, వినయ
గర్భితమైన మా విన్నపాలు ఆ నీరజాక్షుడి దగ్గర నిష్ఫలమైపోయాయి. సోదరులారా, ఇతని నిజస్వరూపాన్ని బయటపెట్టి ఇతని రాజకీయ జీవితాన్ని సర్వనాశనం చేసి, ముఖ్యమంత్రి పదవి నుండి పడదోసి, మళ్ళీ మద్రాసుకు పంపకపోతే మమ్మల్ని మారు పేర్లతో పిలవండి అని సవాళ్ళు గూడా విసిరారు. ఈ సవాళ్ళు ఊపుగా
తీసుకొని చిన్నా చితకా
తమ్ముళ్ళు మరి కొంత మంది దేశంగిరి బయటకి వచ్చి వీళ్ళతో చేరారు. గోడ మీద గుడ్లగూబల్లాగా కాచుకొని ఉన్న కాంగ్రెస్, సి.పి.ఐ. వాళ్ళు సంబరపడి
చంకలు గుద్దుకున్నారు.
ఇక అన్న ఏమంటున్నాడయ్యా అంటే, “మాజీ
తమ్ముళ్ళారా, వేగుల వాళ్ళకు పానకం పోసి పెంచినట్లు, త్రాచు పాములకు పాలు పోసి బలిపించినట్లు, మీ చిన్ననాటి నుండి నేను చేసిన మేలు వ్యర్ధమై పోయింది. అయినా నేను మిమ్మల్ని ఏమీ అనను. మీరు నా
పెద్ద తమ్ముడు భాస్కరరావు కంటే
గొప్పవాళ్ళా ? చిన్న తమ్ముడు శ్రీనివాసులు రెడ్డిని మించిన వాళ్ళా? మీరంతా కలిసి కొత్త పార్టీ
పెట్టుకున్నా కాంగ్రెస్ లో చేరినా నా పార్టీకేమీ నష్టం లేదు. ఎందుకంటే పార్టీ అంటే నేనే గదా . ప్రజలు దేవుళ్ళు వాళ్ళు నన్ను గెలిపిస్తే పదవిలో
ఉంటాను. ఒడిస్తే చైతన్య రధం మీద
మద్రాసు వెళ్ళిపోయి స్వర్గ సుఖాలు అనుభవిస్తాను. అసలు నేనారధం మీద తిరిగిన రోజుల్లో మీరంతా ఎక్కడున్నారు ? రధం నాది, రాజును
నేనే. మీరంతా
రధాన్నిలాగే వాళ్ళు. ఓపిక, త్యాగం ఉన్నవాళ్లను పార్టీ ఎప్పుడూ మరచిపోదు “
తెలుగుదేశం ఎమ్మెల్యేలు పరిస్థితి బాగుపడదామని పోతే బండ చాకిరీ తగులుకున్నట్లుగానే ఉంది. బెల్లం చుట్టూ ఈగలు మూగి నట్లుగా ఎన్టీ ఆర్ చుట్టూ చేరి పదవులకోసం స్వార్ధంతో చెక్క
భజన చేసి, ఆయన మాటను
వేద వాక్కుగా ఔదల దాల్చడమే అంతరంగ ప్రజాస్వామ్యమని తమ అంతరాత్మలకు చెప్పుకొని, మూగ మొద్దుల్లా కాలం గడిపిన వాళ్ళు, పదవి నుండి
పడద్రోయబడగానే ఙ్ఞానోదయమై ఆత్మాభిమానంతో ఒక్కొక్కరే బయటికి రావటం, భాస్కరరావు లాంటి వాళ్ళు నేను ముందే చెప్ప
లేదా అని వెక్కిరించటం ఆనవాయితీ అయ్యింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి