మూర్ఖుడు మారడా ?
గీటురాయి 17-3-1989
బురద గోతులలోన పొరలాడు దుంతకు
సారచందన గంధ చర్చయేల ?
పరగళ్ళ వెంబడి తిరుగు గాడిదకు
విశాల మందిర నివాసంబులేల ?
బయట పుల్లెలు నాకి బ్రతికెడు కుక్కకు
సరసాన్న భక్షణములేల ?
అడవుల చెట్టెక్కి ఆడు కోతికి రత్న
సౌథాగ్ర సీమా సంచారమేల ?
మూర్ఖ జనులకు సతత ప్రమోదకరణ
సాధు సజ్జన గోష్టి ప్రసంగమేల ?
అని ఓ కవి
ఫలానా వాళ్ళకు ఫలానాది అనవసరం అని చెబుతాడు. వాళ్ళ
చుట్టూ గిరులు గీసి వాటిని దాటి ఇవతలికి రావటం మీకు తగదని చెబుతాడు. ఇతని మాటలు కుక్కల్ని నెత్తిన ఎక్కించుకొనే జనానికి కోపం తెప్పించి ఉంటాయి. బురదలో పోర్లాడే పందులకు
ఈనాడు సబ్బుతో స్నానాలు, మంచి తిండి అమరుస్తున్నారు. ఇకపోతే
గాడిదలూ, కోతులూ మాత్రమే కొంచెం నిర్లక్ష్యం చేయబడ్డాయి. ఇలాంటి జంతువులతో ఒక మనిషిని పోల్చి వాడికి మంచి వాళ్ల సహవాసం ఎందుకు అని ప్రశ్నించటం బాగుపడే యోగాన్ని అడ్డుకోవటమే అవుతుంది.
సజ్జనులుమూర్ఖులకు,మూర్ఖులుపండితులకు,పరస్పరం గురువులుగా ఉంటారు. నేర్చుకునే బుద్ధి అంటూ ఉంటే మన చుట్టూ ఉన్న జంతువుల
నుండి సైతం మనం కొన్ని విషయాలు నేర్చుకుంటాం.
మూర్ఖుణ్ణి తీసికెళ్లి ఓ పది మంది పండితుల మధ్య
పడేసి, పదేళ్ళు ఉంచితే వాడికి పాండిత్యం రాకపోయినా పండిత లక్షణాలన్నా రావచ్చు
అన్నారు కొందరు. ఈ పది మంది పండితులు
కూడా ఎటుబడితే అటు వాలిపోయే రకమైతే వాడీ పది మందినీ తన సోదరులు (మూర్ఖ శిఖామణులు)గా మార్చేస్తాడట. అందువలన మార్పు
అనేది సమస్త జీవులలో సహజ లక్షణంగా ఉంది. పరిసరాల
ప్రభావమే జీవులలో మార్పు కలిగిస్తున్నది. దీనికి మనిషి అతీతుడు కాదు. ఆ పద్యం చెప్పిన పెద్దమనిషిని చదువుకు పడెయ్యకుండా జంగిలి గొడ్ల
వెంట తిప్పినట్లయితే ఎలా ఉండేది ?
మరొకాయనెవరో లోకమంతా తిరిగి కుందేటి కొమ్ము తెస్తాను ఎండమావూల్లో
నీళ్ళు త్రాగుతాను, ఇసుకను పిండి తైలం తీస్తాను, ఆకాశంలో
నుంచి ఆవుపేడ తెప్పిస్తానుగాని , చేరి మూర్ఖుడి మనసు రంజింపచెయ్యలేను
అంటాడు. చెయ్యలేనుగాదు “చేయరాదు”
అని శాసిస్తాడు. వాస్తవం ఆలోచిస్తే ఆ మిగతా పనులే అసాధ్యం అనిపిస్తాయి. కాశీకి పోయొచ్చింది మొదలు కామిశెట్టి ఒక్కడే
మావూళ్లో ఏదో కడిగేది అన్నట్లుగా కాస్త
చదువు అబ్బిన పండితులంతా తామొక్కళ్లమే గొప్పగా ఉండాలని వేసిన ఎత్తుగడలే ఇవి. ఉపాయం లేని వాణ్ని ఊళ్ళోంచి వెళ్లగొట్టమని
చెప్పింది ఈ బాపతువాళ్లే.
ఇదంతా
ఎందుకు చెప్పానంటే, ఒక పాపిష్టి తల్లి పాపాయిని కని పందుల దొడ్లో
పారేసి పోతే ఆ పందులే పాలిచ్చి పెంచాయట. ఆ పాపాయి పెద్దదై పందుల్లాగానే గుర్ మంటూ సంభాషణ చేస్తున్నదట. ఆ అమ్మాయిని పట్టుకొచ్చి
కాన్వెంట్లో చేర్చి ప్రత్యేకంగా చదువు చెబుతుంటే ఇప్పుడా అమ్మాయి మన దారిలోకి వస్తున్నదట. మరి ఆ పాపాయికి పెద్ద చదువులెందుకు
? అంటే మన పెద్దతనం నిలుస్తుందా? కాలువ దాటలేనినాడు కడలి దాటగలడా? అన్నారు ఇది వరకు. ఇప్పుడు కుంటివాడు కూడా ఓడ మీద సముద్రం
దాటుతున్నాడు. సరైనశిక్షణ ఇస్తే జంతువులు
సైతం మన ఇష్టం వచ్చినట్లు ఆడతాయి. మూర్ఖుడు మారడా? మారగలిగే
వాతావరణాన్ని మనమే సృష్టించుకోవాలిగాని.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి