న్యాయవ్యవస్థ ప్రక్షాళన : కొన్ని సూచనలు
గీటురాయి 15-9-1989
ప్రజలకు సత్వర న్యాయ సహాయం లభించే విధంగా
న్యాయ వ్యవస్థను ప్రక్షాళనం చేయబోతున్నట్లు శ్రీ రాజీవ్ గాంధీ ఎర్రకోట మీద నుంచి చేసిన ప్రకటన
చాలా సంతోషాన్ని కలిగించింది. అయితే ఈ ప్రకటన ప్రతి ఏటా చేసే అమలు
కాని స్లోగన్ల జాబితాలో చేరకూడదని కోరుకోవటంలో
తప్పు లేదు. ఏవో కంటి తుడుపు చర్యలు కాకుండా ఈ క్రింది మార్పులు తెచ్చి న్యాయ వ్యవస్థను పటిష్టం చెయ్యాలి :
1.
కోర్టులకు ఎలాంటి శలవులు ఉండకూడదు. కోర్టుకు శలవులివ్వటమంటే
న్యాయానికి విశ్రాంతి నివ్వటమే, వేసవి శలవు మొదలైనవి రద్దు చేసి, రైళ్లు బస్సులు మొదలైన ప్రజోపయోగ
సర్వీసులకు మాదిరిగా 365 రోజులూ కోర్టుల చేత పని చేయించాలి. సుప్రీం కోర్టులో
లక్షకు పైగా, హైకోర్టుల్లో 16 లక్షలకు పైగా , దిగువ కోర్టుల్లో కోటికి పైగా కేసులు
పెండింగ్ లో ఉన్నందున ఈ చర్య అవసరం. ప్రతిరోజూ వేలాది కొత్త కేసులు కోర్టుల్లో
దాఖలు అవుతున్నవి. తీర్పు రావటానికి ఎళ్ళ తరబడి వేచి చూడవలసి రావటం శోచనీయం. “ఆలస్యంగా
అందే న్యాయం అందనట్లే”
నని ఒక సామెత కూడా ఉంది. ఆలస్యం వల్ల ఎంతో హాని జరుగుతున్నది. బాధితులకు మేలు జరగటం లేదు. అందువలన కోర్టులకు శలవులు రద్దు చెయ్యాలి.
2.
సుప్రీం కోర్టు మొదలు అన్ని కోర్టులలోని జడ్జీల పోస్టులను
వెంటనే భర్తీ చెయ్యాలి. న్యాయమూర్తులు లేకుండా కేసుల పరిష్కారాన్ని వేగవంతం
చేయాలను కోవడం అర్ధరహితం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జడ్జీల కొరతను ఆలస్యం
లేకుండా భర్తీ చెయ్యాలి.
3.
న్యాయవాడులందరికీ వారు చేపట్టదగిన కేసుల సంఖ్యకు గరిష్ట పరిమితిని విధించాలి. సీనియర్ న్యాయవాదుల దగ్గర
కేసులు పేరుకు పోయి ప్రతిసారీ వాయిదాలు కోరడం వల్ల పెండెన్సీ పెరిగిపోతున్నది.
అందువలన రోజుకు ఒక్క కేసు వాదించగలడనే ప్రాతిపదిక మీద,
కోర్టు సంవత్సరానికి ఎన్ని రోజులు పనిచేస్తుందనుకుంటే అన్ని కేసులు మాత్రమే న్యాయవాదులు చేపట్టేలా వారిపై గరిష్ట కేసుల పరిమితి విధించాలి.
4.
సుప్రీం కోర్టు బెంచీనీ దక్షిణాదిన ఏర్పాటు చెయ్యాలి. అలాగే
పెద్ద రాష్ట్రాలలో కొన్ని చోట్ల హైకోర్టు బెంచీలు ఏర్పాటు చెయ్యాలి. లోక్ అదాలత్
లు ఏర్పాటు ద్వారా కోర్టుల మీద వత్తిడి గణనీయంగా తగ్గినట్టు వార్తలొచ్చాయి. ఈ లోక్
అదాలత్ ల సంఖ్యను హెచ్చించి,
అవి చౌకగా, నిపుణత్వంతో, త్వరితంగా న్యాయ సహాయాన్ని అందించేలా
చూడాలి.
5.
కోర్టు ఫీజును పూర్తిగా రద్దు చెయ్యాలి. వివిధ రంగాల నుండి పన్నులు స్వీకరిస్తున్న ప్రభుత్వం అందులో కొంత ఆదాయాన్ని
ఉచిత న్యాయ సహాయం కోసం వినియోగించడం తప్పు కాదు. కోర్టు
ఫీజు చెల్లించలేక పేదవాడు తాను అన్యాయం పాలై కూడా కోర్టుకు రాలేకపోవడం చాలా అన్యాయం అవుతుంది. ప్రస్తుతం
డబ్బు గలవాడు కొనుక్కోగలిగేలా ఉన్న న్యాయ సహాయం పేదవానికి కూడా అందుబాటులోకి
రావాలి. ‘కోర్టు ఫీజు’ అనేదే అసలు అన్యాయమైన మాట. న్యాయం
చెప్పటానికి పుచ్చుకునే రుసుము. న్యాయ స్థానం స్వీకరించే ముడుపు. సేవా భావంతో కాకుండా వ్యాపార దృక్పధంతో న్యాయ స్థానాలను పని
చేయించటం సిగ్గు చేటు.
6.
న్యాయవాదుల ఫీజులు ఒక క్రమ పద్ధతిలో లేవు. ఎవరి ఇష్టమొచ్చినంత
వారు డిమాండు చేస్తున్నారు. నల్లధనం వీరి దగ్గర బాగా పేరుకు
పోతున్నది. పేద వాళ్ళకు అండగా నిలబడి తక్కువ రేట్లకు వాదించే న్యాయవాదులు బహు
కొద్దిమంది ఉన్నారు. న్యాయవాదులు న్యాయమూర్తులు కుమ్మక్కై లోపాయకారీ అవగాహనలకు
వచ్చి న్యాయాన్ని నిలువు దోపిడీ చేస్తున్న సంఘటనలు కొల్లలు. అయితే కోర్టు ధిక్కారం
అనే దాని భయంతో ఎవరూ నోరు విప్పటానికి సాహసించలేని వాతావరణం నెలకొని ఉంది. కాబట్టి
ప్రభుత్వం న్యాయవాదుల ఫీజుల మీద నియంత్రణ విధించాలి. కుమ్మక్కు వ్యవహారాల మీద నిఘా
అధికం చెయ్యాలి. అసలు న్యాయవాది అవసరం లేకుండా బాధితుడు నేరుగా న్యాయస్థానంలో విన్నవించు
కునేందుకు తగిన సులువైన పద్ధతులను రూపొందించవచ్చేమో ఆలోచించాలి. కోర్టు
వ్యవహారాలను సరళతరం చెయ్యాలి.
7.
ఏళ్ల తరబడి ఒకే కోర్టులో తిష్ట వేసే ఉద్యోగుల వల్ల న్యాయం
కొన్ని సార్లు దెబ్బ తింటున్నది. లంచాలకు అలవాటు పడిన ఉద్యోగులు న్యాయస్థానాలలోనే
ఉంటున్నారంటే, ఇంత కంటే దుఃఖం కలిగించే విషయం ఏముంటుంది ? న్యాయ స్థానాలలోని ఉద్యోగుల మీద నిఘా
వెయ్యాలి. ప్రతి మూడేళ్ళ కొకసారి వారిని బదిలీ చేస్తుండాలి. న్యాయవాదులకు, న్యాయమూర్తులకు బంధుత్వాలేమైనా
ఉన్నాయేమో ఆరా తీసి, వాళ్లను ఒకే చోట నియమించకుండా
దూరప్రాంతాలలో నియమించాలి. న్యాయస్థాపన
కోసం ఇలాంటివన్నీ
చేయక తప్పదు.
8.
న్యాయస్థానపు రకరకాల చట్టాలను వివిధ ప్రాంతీయ భాషలలోకి అనువదించాలి. ఆయా ప్రాంతీయ భాషలలోనే వాద ప్రతివాదాలు, తీర్పులు జరగాలి. తీర్పు వెలువడినాక
దాన్ని టైప్ చేసి, సరి చూసి, పర్యవేక్షకుడు సంతకం చేసి, వాది ప్రతివాదులకు చేరవేయటానికి ఎంతో సమయం పడుతున్నది. కోర్టుల్లో
ఈ కాగితాల వ్రాత కోతల పని ఇంకా పాత కాలపు బూజు పద్ధతులలోనే సాగుతున్నది. దీన్ని త్వరితం చెయ్యడానికి కంప్యూటర్లు, ఫోటో కాపీ యంత్రాలు మొదలైన వాటిని
వాడుకోవాలి. ప్రతి న్యాయమూర్తికి ఒక స్టెనోగ్రాఫర్ ను
సహాయకునిగా ఇవ్వాలి. న్యాయమూర్తి నుండి బాధితులకు అందవలసిన సమాచారానికి గరిష్ట కాల
పరిమితిని విధించాలి.
9.
దేశ జనాభాలో 70 శాతం వరకు నివశిస్తున్న గ్రామీణ ప్రాంతాలలోనే, ప్రాథమిక న్యాయ సహాయక యంత్రాంగాన్ని
నెలకొల్పితే సమస్యలు చాలా వరకు అక్కడి కక్కడే పరిష్కారమై పై కోర్టుల్లో కేసుల సంఖ్య తగ్గుతుంది. గ్రామ
పంచాయతీ ఎగ్జిక్యూటివ్ అఫీసర్లు, గ్రామాభివృద్ధి అధికారులు, గ్రామ సహాయకులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మొదలైన ఉద్యోగులకు న్యాయ శాస్త్రంలో స్వల్పకాలిక శిక్షణ నిచ్చి
గ్రామీణ ప్రాంతాలలో చిన్న చిన్న తగాదాలను పరిష్కరించే అధికారాన్ని వారికి ఇవ్వాలి.
వారిచ్చే తీర్పు నచ్చకపోతే పై కోర్టుకు ఎలాగూ వెళతారు కాబట్టి ముందు గ్రామ
స్థాయిలోనే కొంత వడపోత జరిగేలా చెయ్యాలి.
10.
ఇక చివరిగా ఒక ముఖ్య విషయం. ఇది అంత ప్రధానమైన సంగతి అనిపించదు గాని న్యాయ స్థానంలో నిలబడిన వారి మనస్తత్వం మీద ఎంతో
ప్రభావం చూపుతుంది. నల్లటి గబ్బిలం రంగు గౌనులు న్యాయవాదుల, న్యాయమూర్తుల మనస్తత్వాన్ని మలినం చేసే అవకాశం ఉందని ఇప్పటికే ఎంతో మంది మనస్తత్వ శాస్త్రవేత్తలు చెప్పారు. ఒక
అమెరికన్ సైకాలజిస్టు అయితే,
“నల్లగౌనుల వాళ్ళు మోడరన్
డ్రాక్యులాల వలె” తనకు కనిపిస్తున్నట్లు ఎగతాళి చేశాడు. తెలుపు రంగు
పరిశుద్ధతను, శాంతి కాముకతను, సత్య ప్రియత్వాన్ని సూచించటమే గాక, వాటికి తగిన మానసిక ప్రోత్సాహాన్ని
ఇస్తుంది. అందువలన నల్ల గౌనులు ధరించే పద్ధతిని ఆపివేసి, తెల్ల దుస్తులు ధరించేలా శాసనం
చెయ్యాలి. అడపాదడపా న్యాయవాదులను,
న్యాయమూర్తులను సమావేశపరచి వారి సాధక బాధకాలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలు
కనుక్కోవాలి. నీతి, సత్యము, ధర్మము మొదలైన విషయాల మీద వారికి ఉపన్యాసాలు ఇప్పించాలి. చట్ట
పరిజ్ఞానికి తోడు నీతి నియమాలు,
సత్యసంధత తోడైన న్యాయవాదులను, న్యాయమూర్తులను దేశం తయారు చేసుకోవాలి. రాజకీయం నీడ వీరి మీద
పడకూడదు అనేకంటే, రాజకీయాలలో నీతి వెల్లివిరిస్తే న్యాయస్థానాలు మరింత మంచి బాటలో నడుస్తాయి. మన దేశ
న్యాయ వ్యవస్థ అత్యుత్తమమైనదిగా రూపొందాలని ఆశిద్దాం !
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి