'అర చేతి'లో అంటకత్తెర
గీటురాయి 27-1-1989
పెద్ద కోడలికి పెత్తనమిస్తే ఎలానో ఇంట్లోకి వచ్చిందట. కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీరు చూస్తుంటే ఈ
దేశాన్ని చివరకు ఏం చేస్తుందో గదా అనిపిస్తున్నది.
పెయ్యను కాయమని పెద్ద పులికి అప్పజెప్పినట్లుగానే ఉంది. కాంగ్రెసేతర
ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల వార్షిక ప్రణాళికలకు కేంద్రం వేసిన అంట కత్తెర చాలా అన్యాయంగా ఉంది. ఇక మన రాష్ట్రం సంగతి చూసుకుంటే
మరీ ఘోరంగా ఉంది. 7500 కోట్ల పంచవర్ష ప్రణాళిక
పెట్టుబడిని 5200 కోట్లకు కుదించగా, ఈ ఏడు 1558 కోట్ల పెట్టుబడి అవసరమైన ప్రణాళిక అంచనాను
పంపగా దాన్ని 1250 కోట్లకు అంట గోశారు. మరో వైపు ఆంధ్రప్రదేశ్
ఎలాంటి అభివృధ్ధికీ నోచుకోక అణగారిపోతూ ఉన్నదని దేశమమతటా
గోలచేస్తున్నారు. తెలుగుదేశంలో కొత్తగా ఒక్క రైలు మార్గమైనా వేశారా ? తెలుగు గంగకు అనుమతి ఇచ్చారా ?
పుండొకచోట
మందొకచోట అన్నట్లుగా కేంద్రం తీసుకుంటున్న చర్యలన్నీ వ్యర్ధమై పోతున్నాయి. ఆయా రాష్ట్రాల వైఫల్యం కొన్ని
రంగాలలో కొంత మేరకు ఉండవచ్చు. కానీ ఆ
వైఫల్యాలను సాకుగా తీసుకొని అసలుకే ఎసరు పెట్టడం. అభివృద్ధిని అడ్డుకోవటం కేంద్రానికి తగని పని. దేశం
మీద వసూలవుతున్న ఆదాయంలో సింహ భాగం
దిగమింగుతూ, ప్రతిపక్ష రాష్ట్రాల కడుపులు మాడ్చటం కేంద్రం ఆనవాయితీ అయ్యింది. పేను కుక్కమంటే చెవి కొరికినట్లుగా కేంద్రం రాష్ట్రాల
అభ్యర్ధనలను పెడచెవిని పెడుతున్నది.
పైగా ప్రాజెక్టుల విషయంలో పేచీలు పెడుతున్నది. వీలైతే రాష్ట్రాల మధ్య తగాదాలు పెట్టి తమాషాలు చూస్తున్నది. పరిస్తితి మొత్తం
మీద పిల్లి మెడలో రొయ్యలు కట్టినట్లుగా ఉంది.
పన్నులు
పెంచకుండా ఎప్పుడైనా బడ్జెట్ వచ్చిందా? ద్రవ్యోల్బణం పది శాతం
నిలకడగా ఉంటున్నది. విదేశీ రుణం 23 వేల కోట్లనుండి వీసమెత్తయినా తగ్గిరావటం లేదు. ధరలు ఏ ఏటికాయేడు పెరుగుతూనే ఉన్నాయి.
నిరక్షరాస్యులు, నిరాశ్రయులు, నిరుద్యోగులు, బిక్షగాళ్ళు, దొంగలు, హంతకులు... ఇలా ఎన్నో రకాల ప్రజల సంఖ్య
నానాటికీ పెరుగుతూనే ఉంది. అధికారాలన్నీ గుప్పిట్లో ఉంచుకొని రాష్ట్రాలకు ముష్టి విదిలిస్తున్నట్లుగా
ఫీలయ్యే కేంద్రం, ఈ అవలక్షణాలన్నిటి గురించి దేశం మొత్తం తరుఫున బాధ్యత వహించాల్సి ఉండగా, ఈ దరిద్రత అంతటికీ కారణం ప్రతి పక్ష రాష్ట్రాలేనని బుకాయిస్తున్నది.
వాటి అంతుచూస్తామంటున్నది.
ముడుపులు, విదేశీ ఖాతాలు, లాటరీలు, విలాస యాత్రలు మొదలైన విశేషాలతో
కూడిన కంపును లోలోనే దాచుకుంటూ ప్రతి పక్ష రాష్ట్రాలపై పగబట్టి, ఓ పథకం ప్రకారం వాటి పీకలు నొక్కుతూ, అల్లర్లను చెలరేపుతూ, రాష్ట్రప్రతి
పాలనలు విధిస్తూ, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. సుప్రీంకోర్టు బెంచీనీ , పార్లమెంటు సమావేశాలను దక్షిణాది
రాష్ట్రాలలో ఏర్పాటు
చెయ్యటం లేదు. రేడియో, టెలివిజన్ల ద్వారా హిందీని బలవంతంగా
రుద్దటమేగాక తన స్వంతడబ్బా
వాయించుకుంటున్నది. కుల మత
కలహాలను రెచ్చగొడుతున్నది. తన కాళ్ళకు తానే
మొక్కుకుంటున్నది.
ఇక చాలు
బాబోయ్ ! నేను వినలేను. ఇంకొకణ్ణి వెతుక్కో, నేను వస్తానని
పరుగులంకించుకొని పార్కులో నుంచి ప్రాణాలతో బయటపడ్డాను. మద్రాసు వెళ్ళి వచ్చిన ఒక ‘ఆంద్రావిడ’
నాయకుడు నన్ను బలాత్కారంగా నిలబెట్టి
చేసిన ప్రసంగం పూర్తి పాఠమిది. పాఠకులారా,
నా నెత్తి మీద పడ్డ సుత్తి దెబ్బలను మీ నెత్తుల మీదికి బదిలీ చేయకపోతే నేను కోలుకునేలాలేను. సుత్తికి సుత్తే విరుగుడని నేను ఎక్కడో విన్నాను. తలో ఒక తల వేసి ఆదుకుంటారని ఆశిస్తున్నాను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి